ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్క రోజు వ్యవధిలో జరిగిన సంఘటనలలో పోలీసులు ఇద్దరు మావోయిస్టులను హతమార్చగా... మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో ఒకరిని చంపేశారు. ఈ క్రమంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని సరిహద్దు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత నెలలో ఒడిశాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత కిశోర్ మృతి చెందారు. తాజాగా ఏవోబీలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు... జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ వాకపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడిని పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో ఆదివారం రాత్రి హత్య చేశారు.
ఏవోబీలో హై టెన్షన్.. కొనసాగుతున్న కూంబింగ్ - vishaka agency latest news
ఏవోబీలో ఆదివారం జరిగిన ఘటనలతో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్న మావోయిస్టు నేతల కోసం అడవిని జల్లెడపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
మరోవైపు ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా స్వాభిమాన్ ఆంచల్ కటాఫ్ ఏరియా సింగారం అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో ఏవోబీలో హై అలర్ట్ ప్రకటించారు. తప్పించుకున్న మావోయిస్టు నేతల కోసం కటాఫ్ ఏరియాలో డీవీఎఫ్, ఎస్వోజీ, బీఎస్ఎఫ్, గ్రే హౌండ్స్ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే సింగారంలో కాల్పులు జరిగిన స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలిలో రెండు మృతదేహాలతో పాటు ఓ ఇన్సాస్, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, 4 మ్యాగజైన్లు, 30 రౌండ్ల లైవ్ బుల్లెట్లు, 15 డిటోనేటర్లు, 3 కిట్ బ్యాగ్‌లు, కెమెరా ఫ్లాష్, వాకీ టాకీని మల్కాన్ గిరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్ష రైతు సంఘాల ధర్నా