చిత్తూరు...
ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి నగరపాలక సంస్థ రెండో వార్డులో పోలింగ్ నిలిచిపోయింది. ఆటోనగర్‌లోని రెండో పోలింగ్ కేంద్రంలో వైకాపా అభ్యర్థి, అనుచరులతో పాటు పోలింగ్ సిబ్బంది రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని తెలుగుదేశం అభ్యర్థి సాహితీ యాదవ్ ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తెదేపా నేత నరసింహ యాదవ్ తన అనుచరులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు రీ-పోలింగ్ చేపట్టాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు నగరపాలక సంస్థ 45వ డివిజన్ తెదేపా నేత మురళిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆయన భార్య విజయ 45వ వార్డులో పోటీ చేస్తుండగా..కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మురళిపై దాడి జరిగినట్లు తెదేపా నేతలు భావిస్తున్నారు.
పలమనేరు 4వ వార్డులో వైకాపా అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించటం ఉద్రిక్తతకు దారి తీసింది. వైకాపా అభ్యర్థిని..పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళకుండా తెదేపా అభ్యర్థి అడ్డుకున్నారు. మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి..వైకాపా నాయకులు చేస్తున్న దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారు. తన మనవరాలు పోటీలో వున్న వార్డు సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఓ ఇంట్లోకి వెళ్ళిన సుగుణమ్మను పోలీసులు బయటకు తీసుకవచ్చారు. ఓటు హక్కు లేని వార్డులలో ఇతరులు ఉండకూడదని పోలీసులు సుగుణమ్మను బయటకు పంపారు. నగరి, పుత్తూరు వైకాపా రెబెల్ అభ్యర్థులపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలలో వైకాపా ఓటమికి కొందరు నేతలు పని చేశారని మండిపడ్డారు.
తిరుపతి 15వ వార్డు మహాత్మాగాంధీ పాఠశాల పోలింగ్ కేంద్రంలోకి వైకాపా మద్దతుదారులను అనుమంతించిన పోలీసులు..తమను నిరాకరించారంటూ తెదేపా నాయకులు నిరసనకు దిగారు. వైకాపా, తెలుగుదేశం నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అధికార వైకాపా నేతల దౌర్జన్యాల నుంచి కాపాడి న్యాయం చేయాలంటూ చిత్తూరు 29వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్...పోలీసులకు సాష్టాంగ నమస్కారం చేశారు. రిగ్గింగ్ జరగకుండా చూడాలని పోలీసుల ముందు మోకరిల్లి వేడుకున్నారు.
ప్రకాశం జిల్లా...
మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో...స్థానికేతరుల ఓట్ల విషయంలో వైకాపా, తెదేపా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు నకిలీ గుర్తింపు కార్డులతో ఓటు వేశారని..తెదేపా నాయకులు ఆరోపించారు. ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..ఇరు పార్టీల అభ్యర్థులను, నాయకులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఒంగోలు నగర పాలక సంస్థ పరిధి రెవెన్యూ కాలనీలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెదేపా వర్గీయులు ఆందోళన చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అనంతపురం...
అనంతపురంలో భాజపా కార్పొరేటర్ అభ్యర్థిని డీఎస్పీ వీరరాఘవరెడ్డి లాఠీ విరిగేవరకు కొట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ..పోలింగ్ కేంద్రం వద్ద భాజపా అభ్యర్థి అశోక్ రెడ్డి, కార్యకర్తలు ఆందోళన చేశారు. దొంగ ఓట్లు వేసుకునేందుకు వైకాపా నాయకులు కుట్ర పన్నారని..అనంతపురం 22వ వార్డు తెలుగుదేశం అభ్యర్థి అనురాధ ఆరోపించారు. పార్టీ శ్రేణులతో కలిసి రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళన చేపట్టిన తెలుగుదేశం నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో...పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార పక్షం నేతలకు పోలీసులు అనకూలంగా వ్యవహరిస్తున్నారని...కదిరిలో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. రాణిపేట పాఠశాలలోని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లాలని తెలుగుదేశం నాయకులు, ఏజెంట్లను పోలీసులు హెచ్చరించారని.. ఆగ్రహించిన పార్టీ శ్రేణులు రోడ్డుపై నిరసన చేపట్టారు.
గుంటూరు..
గుంటూరు 43వ డివిజన్‌లో దొంగ ఓట్లు వేస్తున్న కొందరిని తెలుగుదేశం అభ్యర్ధి అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వైకాపా అభ్యర్ధి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు తెదేపా అభ్యర్ధిని పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపించి వేయడంతో..ఆయన తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. ఎంపీ గల్లా జయదేవ్ అక్కడకు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. వైకాపా పార్లమెంట్ ఇంఛార్జ్ మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదనపు పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.