తెలంగాణ

telangana

ETV Bharat / city

రణరంగంగా రామతీర్థం... విజయ సాయిరెడ్డికి నిరసన సెగ - రణరంగంగా రామతీర్థం

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లాలోని రామతీర్థం క్షేత్రం... రాజకీయ రణరంగంలా మారింది. అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ నిరసనలతో ఆ ప్రాంతమంతా నిప్పులు రాజుకున్నాయి. వైకాపా, తెలుగుదేశం, భాజపా శ్రేణుల ప్రదర్శనలు సహా.... చంద్రబాబు, విజయసాయిరెడ్డి పర్యటనలు... అక్కడ మరింత ఉద్రిక్తతకు దారితీసింది. వీటికి తోడు.... విజయసాయిరెడ్డి కారుపై గుర్తుతెలియని వారు ఇటుక విసరటంతో.... పరిస్థితి సున్నితంగా మారింది.

high-tension-at-ramatirtham-in-vizianagram
రణరంగంగా రామతీర్థం... విజయ సాయిరెడ్డికి నిరసన సెగ

By

Published : Jan 2, 2021, 3:22 PM IST

Updated : Jan 2, 2021, 4:45 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థంలో ఇవాళ ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని... బోడికొండపై ఉన్న ఆలయంలో... కోదండరాముని విగ్రహం శిరస్సు ధ్వంసం కావడం... అది సమీపంలోని కొలనులో దొరకడం... రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. తెలుగుదేశం, భాజపా సహా ప్రతిపక్షాలన్నీ వైకాపా పాలనపై విమర్శల వర్షం కురిపించగా... అధికార పార్టీ నేతలు అందుకు దీటుగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, వైకాపా ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం సందర్శనకు తరలివచ్చారు. ఉదయం నుంచి రామతీర్థంలోని కొండ దిగువ ఆలయం వద్ద, బోడికొండ దగ్గర పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

చంద్రబాబు కాన్వాయ్ అడ్డగింత

రామతీర్థానికి వస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌ను అడుగడుగునా అడ్డుకున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయనగరం పట్టణంలోని మూడు రోడ్ల కూడలి వద్ద తమను అడ్డుకున్నారని.... చంద్రబాబుతో కలిసి వెళ్లనీయకపోవడం దారుణమన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా.... చంద్రబాబు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత తిరిగి బయల్దేరిన చంద్రబాబు... నెల్లిమర్ల-రామతీర్థం కూడలి వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను పోలీసులు నిలిపివేశారు. పావుగంట పాటు అక్కడే ఉన్న చంద్రబాబు... అనంతరం అక్కడ్నుంచి నడుచుకుంటూ రామతీర్థం బయల్దేరారు. మెట్లమార్గం ద్వారా బోడికొండపైకి బయల్దేరిన ప్రతిపక్ష నేత..... ప్రారంభంలో కొబ్బరికాయ కొట్టి కొండపైకి బయల్దేరారు. చంద్రబాబు వెంట.... అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు ఉన్నారు.

సాయిరెడ్డి వాహనంపై రాయితో దాడి

బోడికొండ వద్ద వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాకతో... అక్కడ పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఆయన... కొండపైకి వెళ్తుండగా... తెలుగుదేశం, వైకాపా, భాజపా కార్యకర్తలు ఎదురుపడి.... పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో 3 పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొండపైకి వెళ్లి ఘటనాస్థలాన్ని పరిశీలించి.... విజయసాయిరెడ్డి కిందకు దిగుతుండగా..... ఆయన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి... రాయి విసిరారు.

సొమ్మసిల్లిన భాజపా మహిళా నేత

తమను కొండపైకి అనుమతించాలని... దిగువన భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పోలీసులతో ఆ పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. బోడికొండ దిగువన ఎమ్మెల్సీ మాధవ్‌ నేతృత్వంలో... శిబిరం ఏర్పాటు చేసి దీక్షలు చేపట్టారు. ఈ నేపథ్యంలో.... భాజపా శిబిరం వద్ద తోపులాట చోటు చేసుకోగా.... ఆ పార్టీ విజయనగరం అధ్యక్షురాలు రెడ్డి పావని సొమ్మసిల్లి పడిపోయారు.

ఇదీ చదవండి:ఉద్రిక్తం... కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం

Last Updated : Jan 2, 2021, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details