తెలంగాణ

telangana

ETV Bharat / city

మొలాసెస్‌ కోసం కట్టారు.. స్టైరీన్‌కు వాడారు!

మొలాసిస్ నిల్వ కోసం 53 ఏళ్ల క్రితం కట్టిన ట్యాంకును స్టైరీన్ నిల్వ కోసం విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థ వినియోగించిందని.. ఏపీ ప్రభుత్వ హైపవర్ కమిటీ ఆక్షేపించింది. ఈ ప్రమాదకర రసాయనాన్ని పురాతన ట్యాంకులో నిల్వచేయడం శ్రేయస్కరం కాదని పేర్కొంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై నివేదికలో కీలక అంశాలు పొందుపరిచింది.

LG POLYMERS
మొలాసెస్‌ కోసం కట్టారు.. స్టైరీన్‌కు వాడారు!

By

Published : Jul 12, 2020, 11:44 AM IST

'మొలాసెస్‌ నిల్వ కోసం కట్టిన ట్యాంకును స్టైరీన్‌ నిల్వకు వినియోగించారు. అందుకు అవసరమైన మార్పులు చేపట్టలేదు. ట్యాంకు కట్టి 53 ఏళ్లు దాటినందున.. దీన్ని వినియోగించొచ్చా.. లేదా? అనే అంశంపై ‘మెకానికల్‌ ఇంటెగ్రిటీ అసెస్‌మెంట్‌’ చేయించలేదు. ‘జీవితకాల పరిమితి పొడిగింపు’ చర్యలు చేపట్టకుండానే 1967లో కట్టిన ట్యాంకునే స్టైరీన్‌ నిల్వలకు ఎల్‌జీ పరిశ్రమ వినియోగించింది. ఈ ప్రమాదకర రసాయనాన్ని అంత పురాతన ట్యాంకులో నిల్వ చేయటం శ్రేయస్కరం కాదు'’’ అని విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనను విచారించిన ఏపీ ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ ఆక్షేపించింది. ఈ ట్యాంకు లోపలి భాగంలో లైనింగ్‌ లేకపోవటం, అయిదేళ్ల క్రితమే శుభ్రపరచటంతో లోపలి భాగం తుప్పు పట్టిందని, స్టైరీన్‌ పాలిమరైజేషన్‌కు ఇది ఉత్ప్రేరకంగా పనిచేసిందని వివరించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 4 నుంచి 28వ తేదీ వరకూ ట్యాంకులో ఉన్న స్టైరీన్‌లో పాలిమర్‌ పరిమాణం అసాధారణంగా పెరుగుతున్నట్లు గమనించినా.. ఎల్‌జీ యాజమాన్యం పట్టించుకోలేదని, ఈ పెరుగుదలను స్టైరీన్‌ నాణ్యతకు ప్రామాణికంగా తీసుకుందే తప్ప భద్రత కోణంలో చర్యలు తీసుకోలేదని తప్పుపట్టింది. ట్యాంకు పైభాగంలో పగుళ్లను పట్టించుకోలేదని.. దీనిపై ఫోరెన్సిక్‌ తనిఖీ అవసరమని పేర్కొంది. ఏపీ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ రూపొందించిన పూర్తి నివేదిక అందుబాటులోకి వచ్చింది. అందులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.

తనిఖీల్లో సూచించినా చర్యలు తీసుకోలేదు...

* 2016లో ఎల్‌జీ పరిశ్రమలో చేపట్టిన తనిఖీల్లో 16 అంశాలను గుర్తించి వాటిని సరిదిద్దాలని సంస్థకు సూచించారు. 2019 వరకూ వాటిని పరిష్కరించలేదు. 2019లో తనిఖీల సందర్భంగా మరో 18 అంశాలను గుర్తించి వాటిని సరిచేయాలని చెప్పారు. అవి పూర్తి చేశారా.. లేదా? అనేది స్పష్టత లేదు.

* పరిశ్రమలో తనిఖీల బాధ్యతను 2017లో శ్రీకాకుళం డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జీవీఎస్‌ నారాయణకు, 2018లో విజయనగరం డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ సీహెచ్‌. శైలేంద్రకుమార్‌కు అప్పగించారు. అయితే వారు తనిఖీ చేయలేదు. వారిపై చర్యలు తీసుకోవాలి.

* ఈ సంస్థకు తగిన పర్యావరణ అనుమతులు లేవు.

* ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీఎఫ్‌ఈ) జారీచేసినప్పుడైనా ఆ ప్లాంటు నివాస ప్రాంతంలో ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది.

* పరిశ్రమలోని ఇంజినీర్లకు తగిన అర్హతలు లేవు.

సెన్సర్లు అప్రమత్తం చేయాలి

* విషపూరిత, ప్రమాదకర వాయువులు లీకైనప్పుడు వాటిని గుర్తించే సెన్సర్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఆ సెన్సర్లు స్థానిక పోలీసుస్టేషన్‌, ఫైర్‌ స్టేషన్‌లను అప్రమత్తం చేసేలా ఉండాలి.

* ప్రమాదకర రసాయనాలను చిన్న ట్యాంకుల్లో నిల్వ చేయాలి. భారీగా నిల్వ చేయాలంటే అవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలి.

* పారిశ్రామికవాడలకు తగిన బఫర్‌ జోన్‌ను ఏర్పాటుచేయాలి. ఈ ప్రాంతాన్ని ఇతర అవసరాల కోసం మళ్లించకూడదు.

ఇవీచూడండి:విశాఖ గ్యాస్​ లీక్​లో యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం: హైపవర్​ కమిటీ

ABOUT THE AUTHOR

...view details