High Level Committee on Atchutapuram incident: ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం బ్రాండిక్స్ పరిధిలో ఉన్న సీడ్స్ కంపెనీలో ఇటీవల రెండోసారి గ్యాస్ లీక్ అయిన సంఘటనపై దర్యాప్తు చేసేందుకు... రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ ఈరోజు తనిఖీ నిర్వహించింది. ఇక్కడ దుస్తుల తయారీ పరిశ్రమలో గ్యాస్ లీక్ కారణాలపై విచారణ చేపట్టింది. రెండోసారి గ్యాస్ లీక్ అయిన సంఘటనలో 121 మంది మహిళా కార్మికుల అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. రెండు నెలల వ్యవధిలో సీడ్స్‌లో రెండుసార్లు గ్యాస్ లీక్ అవ్వడం, మహిళలు అస్వస్థత గురికావడంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విచారణకు కమిటీ నియమించింది. వీరు పరిశ్రమ లోపల విచారణ చేపట్టారు. ప్రమాదాలకు కారణాలపై విచారిస్తున్నారు.
ఇదీ జరిగింది:అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 53 మంది మహిళలు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది జూన్ 3న ఇదే కంపెనీలో విషవాయువు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అదే తరహాలో గాఢమైన విషవాయువు లీక్ కావడంతో.. బీ-షిఫ్టులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వాంతులు, తల తిరగడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భోజన విరామ సమయంలో వాయువు వెలువడిందని.. కొన్ని నిమిషాల్లోనే వ్యాపించి ఏం జరిగిందో తెలుసుకునే లోపే కుప్పకూలిపోయినట్టు బాధితులు చెబుతున్నారు.