తెలంగాణలో నూతన మద్యం విధానం వచ్చే నెల ఒకటి నుంచి అమల్లోకి రానుంది. రెండేళ్లపాటు ఈ కొత్త విధానం కొనసాగనుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, లాటరీ విధానం ద్వారా లైసెన్స్‌ల జారీ ప్రక్రియ పూర్తైంది. 2017-19 సంవత్సరంలో 40 వేల 918 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.411 కోట్ల రాబడి వచ్చింది. తాజాగా దరఖాస్తు రుసుము లక్ష నుంచి 2 లక్షలకు పెంచడం, 48వేల 402 దరఖాస్తులు రావడం వల్ల ఈసారి రూ. 968.04 కోట్లకు పెరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా 2, 216 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయిదు దుకాణాలు న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లో 7, రంగారెడ్డిలో 2, నిజామాబాద్‌లో 10, కరీంనగర్‌లో 8, మేడ్చల్ మల్కాజిగిరిలో 2 దుకాణాల విషయంలో... సిండికేట్ ఏర్పడి ఉండొచ్చనే అనుమానంతో ప్రక్రియ నిలిపేశారు. మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించగా... దాదాపు 500 దాఖలైనట్లు అబ్కారీ అధికారులు తెలిపారు. ఆయా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డ్రా ద్వారా లెసెన్సీ ఎంపిక జరగనుంది.