తెలంగాణ

telangana

ETV Bharat / city

గడ్డి అన్నారం మార్కెట్‌లో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశం - గడ్డి అన్నారం మార్కెట్​ వార్తలు

Gaddi Annaram Market
Gaddi Annaram Market

By

Published : Mar 8, 2022, 3:27 PM IST

Updated : Mar 8, 2022, 4:45 PM IST

15:25 March 08

గడ్డి అన్నారం మార్కెట్‌లో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశం

High Court stay on Gaddi Annaram Market Demolition: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్​లో కూల్చివేతలను వెంటనే ఆపాలని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలు దురదృష్టకరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్​ చంద్రశర్మ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వ్యాపారులు తమ వస్తువులను బాటసింగారం తరలించేందుకు వీలుగా నెల రోజుల పాటు గడ్డి అన్నారం మార్కెట్ తెరవాలని గత నెల 8న హైకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయడం లేదని ఉన్నత న్యాయస్థానం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఈనెల 4న హడావుడిగా మార్కెట్ తెరిచారు.

కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు

గత నెల 8న ఆదేశించినప్పటికీ.. ఈనెల 4 వరకు మార్కెట్​లోకి అనుమతించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడటంతో పాటు కూల్చివేస్తున్నారని వ్యాపారుల తరఫు న్యాయవాది గంగయ్య నాయుడు ఇవాళ హైకోర్టుకు తెలిపారు. వందలాది పోలీసులను మొహరించి అర్ధరాత్రి నుంచి మార్కెట్ కూలుస్తున్నారని వివరించారు. గడ్డి అన్నారం మార్కెట్​లోని 106 మంది కమీషన్ ఏజెంట్లలో 76 మంది ఖాళీ చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్​పై విచారణ ఈనెల 14కి వాయిదా వేసిన హైకోర్టు.. మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ లక్ష్మీబాయి హాజరు కావాలని ఆదేశించింది.

ఉదయం నంచే కూల్చివేతలు

గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ యార్డులో షెడ్లు తొలగింపును తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు. పండ్ల మార్కెట్‌ ఆవరణలో మార్కెటింగ్ శాఖ, రోడ్లు, భవనాలు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాత షెడ్లు, భవనాలను తొలగిస్తున్నారు. కూల్చివేత సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎల్‌బీ నగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ సామగ్రి, ఇతర వస్తువులను కమీషన్ ఏజెంట్ల ట్రక్కులు, ఆటోల్లో తీసుకుని వెళ్లిపోతున్నారు.

రెండు రోజుల గడువు పూర్తి కావడంతో

సోమవారం తాము మార్కెట్‌ ఖాళీ చేసేది లేదంటూ వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఏ క్షణాన్నైనా మార్కెట్‌కు తాళాలు వేస్తారోమోనని ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు నచ్చజెప్పి శాంతింపజేశారు. కానీ, హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం మార్కెట్ ప్రాంగణం ముఖద్వారాల తాళాలు తెరిచిన మార్కెటింగ్ శాఖ... రెండు రోజుల గడువు పూర్తి కావడంతో రోడ్లు భవనాలు శాఖ ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేతలకు ఉపక్రమించారు.

ఇక్కడ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

గత జనవరిలో పండ్ల మార్కెట్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు, భవనాల శాఖకు మార్కెటింగ్ శాఖ అప్పగించింది. ఈ సువిశాల 23 ఎకరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు సాగుతున్నాయి. కోహెడలో ప్రభుత్వం కేటాయించిన 178 ఎకరాల్లో మౌలిక సదుపాయాలతో కూడిన ఆసియా ఖండంలోనే అతి పెద్ద పండ్ల మార్కెట్ నిర్మాణానికి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అప్పటి వరకు తాత్కాలికంగా బాటసింగారంలో

న్యాయస్థానం ఇచ్చిన గడువు పూర్తైన నేపథ్యంలో నిబంధనల ప్రకారం గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ యార్డులో షెడ్లు, వేలం ఫ్లాట్‌ఫారాలు, భవనాలు కూల్చివేస్తున్నామని మార్కెటింగ్ శాఖ ప్రకటించింది. బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులోనే తాత్కాలికంగా పండ్ల మార్కెట్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. కోహెడలో శాశ్వత ప్రాతిపదిక మార్కెట్ పూర్తయ్యే వరకు బాటసింగారంలో పండ్ల క్రయ, విక్రయాలు సాగుతాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :బాటసింగారం లాజిస్టిక్​ పార్కులో పండ్ల మార్కెట్​!

Last Updated : Mar 8, 2022, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details