HIGH COURT SERIOUS ఆంధ్రప్రదేశ్ వైకాపా ప్రభుత్వంలో కొండవీటిచాంతాడులా పెరిగిపోతున్న సలహాదారులపై.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవదాయశాఖ సలహాదారుగా ఇటీవల జె.శ్రీకాంత్ నియామక జీవోను నిలుపుదల చేసింది. శ్రీకాంత్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‍కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ జీవోపై స్టే ఇచ్చిన హైకోర్టు సందర్భంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
సలహాదారులను నియమించేందుకు అధికారుల కొరతేమైనా ఉందా అని నిలదీసింది. మంత్రులకు సలహాదారులు ఉంటే అర్థం ఉందిగానీ.. శాఖలకు సలహాదారు ఏమిటని ప్రశ్నించింది. ఇలానే వదిలేస్తే రేపు అడ్వకేట్ జనరల్‌కూ సలహాదారుణ్ని నియమిస్తారని వ్యాఖ్యానించింది. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆక్షేపిచింది.
అసలేం జరిగిందంటే:అనంతపురం జిల్లాకు చెందిన జ్వాలాపురం శ్రీకాంత్‌ను దేవాదాయశాఖ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం(ఆగస్టు 5) ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లు ఉంటారు. శ్రీకాంత్ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు. ఈ సమాఖ్యలో ఉండే ముగ్గురు విడిపోయి, దీన్ని మూడు ముక్కలు చేశారు. ఎవరికి వారు తమనే అధ్యక్షులుగా చెప్పుకొంటున్నారు. వారిలో శ్రీకాంత్ ఒకరు.