తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు చేస్తున్నారా? లేదా?

By

Published : Jul 1, 2020, 2:32 PM IST

Updated : Jul 1, 2020, 8:28 PM IST

రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు చేస్తున్నారా లేదా?
రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు చేస్తున్నారా లేదా?

14:29 July 01

రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు చేస్తున్నారా? లేదా?

కరోనా పరీక్షలు, కేసుల వివరాల వెల్లడి వంటి అంశాలపై ప్రభుత్వం తీరును హైకోర్టు మరోసారి తప్పు పట్టింది. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసిన ఉన్నత న్యాయ స్థానం... రాజ్యాంగ పరమైన విధులను విస్మరించ రాదని పేర్కొంది. కరోనాకు సంబంధించి దాఖలైన ఏడు ప్రజా ప్రయోజన వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. 

 

ఆదేశించినప్పటికీ..

తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనాపై ప్రభుత్వం ఇస్తున్న బులెటిన్లలో సమాచారం అరకొరగా ఉంటోందని,  కీలకమైన సమాచారం ఉండటం లేదని తెలిపింది. వార్డుల వారీగా కరోనా కేసుల వివరాలను వెల్లడించాలని.. పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాలని ఆదేశించినప్పటికీ అమలు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఉత్తర్వులు ఎలా జారీ చేశారు?

ఐసీఎంఆర్​ మార్గదర్శకాల ప్రకారం రాపిడ్ యాంటీ జెంట్ టెస్టులు చేయాలని ఆదేశించినప్పటికీ... ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓవైపు కరోనా తీవ్రత పెరుగుతుండగా మరోవైపు ప్రభుత్వం పరీక్షలను తగ్గిస్తోందని ఆందోళన వెలిబుచ్చింది. పరీక్షలు చేయకుంటే కరోనా తీవ్రత, వ్యాప్తి ఎలా తెలుస్తుందని.. దాన్ని ఎలా ఎదుర్కోవాలనే ప్రణాళికలు ఏ విధంగా సిద్ధం చేస్తారని సూటిగా ప్రశ్నించింది. కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య విభాగం సంచాలకుడు శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేయడం ఆశ్చర్యంగా ఉందన్న ధర్మాసనం.. నిరంతరం పరీక్షలు జరగాలని ఐసీఎంఆర్​ చెబుతుండగా.. స్వయంగా వైద్యుడైన డైరెక్టర్ అలాంటి ఉత్తర్వులు ఎలా జారీ చేశారని ప్రశ్నించింది. కేవలం రెండు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారని ఏజీ వివరణ ఇవ్వగా.. చట్టాలను, నిబంధనలను తమకు ఇష్టం ఉన్నన్ని రోజులు ఉల్లంఘించొచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అనుసరిస్తున్నామని ఓ వైపు సీఎస్ మీడియా ప్రకటనలు ఇస్తున్నారని.. మరోవైపు పరీక్షలు నిలిపివేస్తూ పీహెచ్ డైరెక్టర్ ఆదేశాలు ఇస్తున్నారని ఇద్దరిలో ఎవరి నమ్మాలని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.


స్పష్టమైన సమాధానమివ్వాలి..

రాష్ట్రంలో కంటెయిన్‌మెంట్‌ విధానమేంటో తెలపాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కంటెయిన్‌మెంట్ ప్రాంతాల జాబితా సమర్పించాలని స్పష్టం చేసింది. గత 20 రోజులుగా రాష్ట్రంలో జరిగిన కరోనా పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని తేల్చిచెప్పింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు చేస్తున్నారా? లేదా? వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం ఏమేమి అంశాలు పరిశీలించింది..? వాటిలో ఏం తేలింది అనే విషయాలను సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ ఆస్పత్రుల్లో పీపీఈ కిట్లు మాస్కులు ఎన్ని ఇచ్చారని ఇప్పటికి 9 సార్లు అడిగినప్పటికీ స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎన్ని కిట్లు ఉన్నాయని తమకు అవసరం లేదని.. వైద్య సిబ్బందికి ఎన్ని ఇచ్చారో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని మరోసారి ఆదేశించింది.


ఈ నెల 17 లోగా..

గతంలో తమ ఆదేశాలు సర్కారు చెవిటి చెవిలో శంఖం ఊదినట్లయ్యాయని.. ఈసారి కచ్చితంగా అమలు చేయాల్సిందేనని హెచ్చరించింది. ఈ నెల 17 లోగా తాజా ఆదేశాలు అమలు కాకపోతే.. ఈ నెల 20న సీఎస్, వైద్యారోగ్య, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, జిహెచ్ఎంసి కమిషనర్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.


 

Last Updated : Jul 1, 2020, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details