రాష్ట్ర విభజనకు ముందు పదవీ విరమణ చేసిన ఏపీ గృహ నిర్మాణ మండలి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం పింఛను చెల్లించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పెన్షన్ చెల్లింపుల్లో... ఒకే దేశంలో ఉన్నవారిపట్ల ప్రాంతీయ వివక్ష చూపడం తగదని స్పష్టం చేసింది. పదవీ ప్రయోజనాలు చెల్లించాలని ఆదేశిస్తూ.... గతేడాది ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై 281 మంది దాఖలు చేసిన రెండు కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది.
High Court : ఏపీ గృహ నిర్మాణ మండలి ఉద్యోగులకు పింఛన్ చెల్లించాల్సిందే
తెలంగాణ విభజనకు ముందు పదవీ విరమణ చేసిన ఏపీ గృహ నిర్మాణ మండలి ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్.. పింఛను చెల్లించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఒకే దేశంలో ఉన్నవారిపట్ల ప్రాంతీయ వివక్ష చూపడం తగదని వ్యాఖ్యానించింది. నాలుగు వారాల్లోగా కోర్టు తీర్పును అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
పదవీ విరమణ ప్రయోజనాలను బతికి ఉన్నపుడే అనుభవిస్తారని.. తర్వాత ఇచ్చినా ప్రయోజనం ఉండదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చి ఏడాది దాటినా అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. 4 వారాల్లో కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని లేని పక్షంలో కోర్టు ధిక్కరణ పిటిషన్లో తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేసింది.
తీర్పును అమలు చేసేందుకు.. ఆరు నెలల గడువు ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషద్ కోరగా... ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే ఏడాది దాటినా అమలు చేయలేదని మళ్లీ ఆరు నెలలు అడగటం సరికాదని వ్యాఖ్యానించింది.