తెలంగాణ

telangana

ETV Bharat / city

జీడిమెట్ల కాలుష్యంపై హైకోర్టు అసంతృప్తి.. - high court news

హైదరాబాద్ నగర శివార్లలో జీడిమెట్లలోని పరిశ్రమల కాలుష్యం నివారణకు పీసీబీ చేపట్టిన చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. 2015 నుంచి 2019 వరకు 4 ఏళ్లలో కేవలం 45 కేసులను మాత్రమే నమోదు చేయడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను జూన్ 24 కల్లా సమర్పించాలంటూ 26కు విచారణను వాయిదా వేసింది.

జీడిమెట్ల కాలుష్యంపై హైకోర్టు అసంతృప్తి..
జీడిమెట్ల కాలుష్యంపై హైకోర్టు అసంతృప్తి..

By

Published : Jun 11, 2020, 6:02 AM IST

హైదరాబాద్ నగర శివార్లలో జీడిమెట్లలోని పరిశ్రమల కాలుష్యం నివారణకు పీసీబీ చేపట్టిన చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పరిశ్రమలు విడుదల చేసిన రసాయనాలతో భూగర్భ జలాలు కలుషితమై భవిష్యత్తరాలు అంగవైకల్యంతో పుట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖ సంఘటన నేపథ్యంలో శివార్లలో ఉన్న బల్క్ డ్రగ్ యూనిట్లు, ఫార్మ కెమికల్ యూనిట్లను పరిశీలించి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పకపోవడాన్ని తప్పుబట్టింది.

నివేదిక అసమగ్రంగా..

2015 నుంచి 2019 వరకు 4 ఏళ్లలో కేవలం 45 కేసులను మాత్రమే నమోదు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా చెప్పడం లేదంది. నిబంధనల ఉల్లంఘనపై మూసివేత నోటీసులు ఇచ్చి మళ్లీ వాటిని తెరవడానికి ఎందుకు అనుమతించారన్న వివరాలను పేర్కొనకుండా నివేదికను అసమగ్రంగా ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్య కనీస ప్రామాణిక స్థాయి చెప్పకుండా ప్రస్తుతం ఏ దశలో ఉందో చెబితే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను జూన్ 24 కల్లా సమర్పించాలంటూ విచారణను 26కు వాయిదా వేసింది.

ఈనాడు కథనంతో..

గత ఏడాది డిసెంబరు 23న ఈనాడు హైదరాబాద్ మినీలో 'జీడిమెట్ల బతుకుడెట్ల' అనే శీర్షిక కింద ప్రచురితమైన కథనంతో పాటు న్యాయవాది సీహెచ్.రవీందర్ రాసిన లేఖలను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణించింది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.

గత ఏడాది ఒక్క ప్రాసిక్యూషన్ కూడా..

నగర శివార్లలో 220 బల్క్ డ్రగ్ యూనిట్ తనిఖీలో వెల్లడైన విషయాలేంటో ఎందుకు చెప్పలేదంది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ స్పందిస్తూ ప్రస్తుతం ఇంకా తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు. 799 ఫార్మా కెమికల్ యూనిట్లు ఉన్నాయని వాటిలో 708కి అనుమతి ఉందన్నారు. 24 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కేవలం రెండింటికే మూసివేత ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొంది. 23 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొన్నారని అవి ఏ స్థాయిలో ఉన్నాయో కూడా చెప్పలేదని మండిపడింది. గతేడాది ఒక్క ప్రాసిక్యూషన్ కూడా జరగలేదని హైకోర్టు వెల్లడించింది.

విచారణ వాయిదా..

ఈ ఆరునెలల్లో ఎక్కువ కేసులు పెట్టినట్లు చూపుతున్నారని అంటే కోర్టు జోక్యం చేసుకున్నాకే కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.


ఇవీ చూడండి:నగరవాసిని పలకరించిన తొలకరి జల్లులు

ABOUT THE AUTHOR

...view details