రాష్ట్రంలో ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో పేద పిల్లలకు సీట్లు కేటాయిస్తారా? లేదా? తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతుల్లో 25 శాతం సీట్లు పేద, బలహీన వర్గాలకు కేటాయిస్తూ.. 2010లో జారీ చేసిన జీవో 44 అమలుపై రానున్న విద్యా సంవత్సరం ప్రారంభంలోగా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదని గతంలో దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2010లో జీవో 44 అమలు చేసిందని, అయితే ఉమ్మడి హైకోర్టు ఆ జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ వివరించారు. నలంద విద్యా సంస్థలు దాఖలు చేసిన ఆ పిటిషన్ ప్రస్తుతం ఏపీ హైకోర్టుకు బదిలీ అయిందని తెలిపారు. స్టే ఎత్తివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది.