హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై శుక్రవారం హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని నియంత్రించలేని జీహెచ్‌ఎంసీ తీరును తప్పుబట్టింది. క్రమబద్ధీకరణలకు జీవోలు ఇచ్చే ప్రభుత్వ విధానమూ సరికాదంది. రంగారెడ్డి జిల్లా గడ్డిఅన్నారంలో అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేసినా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంపై శివాజీ అనే వ్యక్తితోపాటు మరొకరు వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్‌లపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్రమ నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో హైదరాబాద్ నగరం కాస్తా భయంకరంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్పందించాల్సిన సమయమిదేనని పేర్కొంది.
ఇది సరికాదు...
రాష్ట్రంలోని భూములకు తెలంగాణ ప్రభుత్వం ట్రస్టీలాంటిది. తన భూములను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. ప్రతి అయిదేళ్లకోసారి ఓ జీవో జారీ చేస్తూ అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ అక్రమ నిర్మాణదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోందని పేర్కొంది. అక్రమ నిర్మాణాల పట్ల అనుసరించాల్సిన విధానం ఇది కాదని పేర్కొంది. శామీర్‌పేట చెరువులో ఆక్రమణలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఇలాంటివి ప్రారంభమైనపుడే అడ్డుకోవాల్సి ఉందని పేర్కొంది. ఈ జాడ్యం ఇలాగే కొనసాగితే చెరువులన్నీ కనుమరుగై పర్యావరణం దెబ్బతింటుందని హెచ్చరించింది.