తెలంగాణ

telangana

ETV Bharat / city

'ధరణి'లో ఆస్తుల నమోదు నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ

ధరణి వెబ్‌పోర్టల్‌ చట్టబద్ధతపై హైకోర్టులో విచారణ జరిగింది. ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడే ప్రమాదముందని పిటిషనర్ పేర్కొనగా..‌ పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని అడ్వకేట్ జనరల్‌కు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

High Court refuses to suspend registration of assets in Dharani
‘ధరణి’లో ఆస్తుల నమోదు నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ

By

Published : Oct 11, 2020, 5:12 AM IST

Updated : Oct 11, 2020, 6:00 AM IST

వ్యవసాయేతర ఆస్తుల రికార్డులను రూపొందించడానికి ప్రభుత్వం తలపెట్టిన ‘ధరణి’లో ఆస్తుల నమోదు ప్రక్రియను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ధరణి పోర్టల్‌ చట్టబద్ధత, పూర్తి వివరాలతో వారంలోగా కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమగ్ర భూనిర్వహణ విధానంలో భాగంగా ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి విధానాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్‌మెట్‌ మండలం రాగన్నగూడకు చెందిన జి.ఆర్‌.కరుణాకర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ విచారణ చేపట్టారు.

సమగ్ర కుటుంబ సర్వే సంగతేంటి..

పిటిషనర్‌ తరఫు న్యాయవాది శశికిరణ్‌ వాదిస్తూ వివరాల సేకరణకు ఎలాంటి అధికారం, చట్టం లేకపోయినా ఈ ప్రక్రియ చేపట్టడం వల్ల సమయం, ప్రజాధనం వృథా అవుతోందని చెప్పారు. పట్టణాలు, గ్రామాల్లో రికార్డుల నిర్వహణకు ప్రత్యేక చట్టాలు, శాఖలుండగా ఎలాంటి చట్టం, అధికారం లేకుండా ‘ధరణి’ పేరుతో బహిరంగ వెబ్‌సైట్‌ పెట్టి ఆస్తుల వివరాలను నమోదు చేయాలంటూ వేధింపులకు గురి చేయడం.. ప్రజల గోప్యతకు భంగం కలిగించడమేనన్నారు. ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా సేకరించిన వివరాల సంగతేమిటో తెలియడంలేదన్నారు.

ఏ చట్టం కింద చేపట్టారో చెప్పడంలేదు..

రైతుబంధు పథకం అమలులో భాగంగా వివరాలు సేకరించారన్నారు. ఈ విధానం వల్ల ఆస్తులపై హక్కులకు సంబంధించి వ్యతిరేక ప్రభావం మొదలవుతుందని చెప్పారు. ఆక్రమణదారులు ఇతరుల భూములను పోర్టల్‌లో నమోదు చేసుకుంటే యజమాని హక్కులను ఏ చట్టం కింద రుజువు చేసుకోవాలో తెలియదన్నారు. పాన్‌ కార్డుకు ఆదాయపు పన్ను చట్టం, ఆధార్‌ కార్డుకు ఆధార్‌ చట్టం, బ్యాంకు పాస్‌ బుక్‌కు బ్యాకింగ్‌ చట్టాలున్నాయని, అయితే ఈ ప్రక్రియ ఏ చట్టం కింద చేపట్టారో చెప్పడంలేదని కోర్టుకు తెలిపారు. ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.

దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ జోక్యం చేసుకుంటూ పారదర్శకంగా ఆస్తుల వివరాలకే ఈ కార్యక్రమం చేపట్టామని, గడువిస్తే వివరాలు సమర్పిస్తామని విన్నవించారు. తదుపరి విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది

ఇవీ చూడండి:గ్రామ కార్యదర్శికి ఆస్తుల వివరాలు తెలిపిన సీఎం కేసీఆర్

Last Updated : Oct 11, 2020, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details