సినీ దర్శకుడు ఎన్. శంకర్‌కు, జీయర్ ఇంటిగ్రేటెడ్ అకాడమీ, విశాఖపట్టణం శారదాపీఠం, కమ్మ, వెలమ సంఘాలకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో నిర్మాణాలను నిలిపి వేయడానికి హైకోర్టు(high court latest update) నిరాకరించింది. ఈ భూముల్లో చేపట్టే నిర్మాణాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. భూకేటాయింపులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ఈమేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2018లో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల్లాలో ఎకరం రూ. 5 లక్షల చొప్పున 5 ఎకరాల భూమిని సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు కేటాయించడాన్ని సవాలు చేస్తూ జె.శంకర్, యాదాద్రి భువనగిరి జిల్లా గుండ్లపల్లిలో జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీకి 2.30 ఎకరాలు కేటాయించడంపై వీరాచారి, సంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో శారదాపీఠానికి 2 ఎకరాలు కేటాయించడంపై సీహెచ్.వీరాచారి, శేరిలింగంపల్లి మండలం ఖానామెలో ఆలిండియా వెలమ అసోసియేషన్, కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు 5 ఎకరాల చొప్పున కేటాయించడాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్ ఎ.వినాయక్ రెడ్డి వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వెలమ, కమ్మ సంఘాలకు భూములను కేటాయించాలని జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారని.. తరువాత రెండు రోజుల్లోనే భూ కేటాయింపు జరిగిందన్నారు. ఇక్కడ ఎకరం రూ. 100 కోట్ల దాకా ఉంటుందని, ఒక్కో కులానికి రూ.500 కోట్ల విలువైన భూమిని కేటాయించారన్నారు. అత్యంత ధనిక కులాలకు ఈ స్థలాలను కేటాయించారనన్నారు. అక్కడ ఒక కులానికి చెందిన భవన నిర్మాణానికి చందాలు సేకరించాల్సిన అవసరం లేదని.. ఒక వ్యక్తి ఖాళీ చెక్ ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 792 కులాలున్నాయని, అందరికీ ఇలానే కేటాయిస్తారా అని ప్రశ్నించారు. కులాలను సంతృప్తి పరచడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ న్యాయవాది ఎ.సంతోష్ కుమార్ జోక్యం చేసుకుంటూ.. ఈ కులాలకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయనగా నిర్మాణాలను చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది సత్యం రెడ్డి కోరారు. కనీసం యథాతథస్థితిని అయినా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దానికి ధర్మాసనం నిరాకరిస్తూ.. ఈ నిర్మాణాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయన్నారు. అన్ని పిటిషన్లను కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: