తెలంగాణ

telangana

ETV Bharat / city

పింఛన్​దారులకు కరోనా వస్తే పరిస్థితేంటి..?

కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ విధించాయి. అన్నీ వ్యవస్థలు, కార్యకలాపాలు స్తంభించిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఆర్థిక లోటును పూడ్చేందుకు ఉద్యోగుల, పెన్షనర్ల వేతనాల్లో కోత విధించింది. విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో ఏ ప్రాతిపదికన కోత విధించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

high court questioned to telangana governament for pension cuttings
పింఛన్​దారులకు కరోనా వస్తే పరిస్థితేంటి..?

By

Published : Apr 17, 2020, 6:00 PM IST

విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో కోత విధించడం మసంజసం కాదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వారికి కొంత ఉపశమనం ఇవ్వాలని పేర్కొంది. వృద్ధులు అనారోగ్యం పాలైతే ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించింది. ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించాలని వ్యాఖ్యానించిన ధర్మాసనం... తాము గతంలో కోరినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. పింఛన్ల కోత అంశాన్ని ప్రభుత్వం సమీక్షిస్తోందని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి వివరించారు.

పింఛన్​లో యాబై శాతం కోత విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 27ను సవాల్ చేస్తూ దాఖలైన మూడు వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ. అమర్​నాథ్ గౌడ్ ధర్మాసనం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు లక్ష్మయ్య, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు నాగటి నారాయణతో పాటు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి రాసిన లేఖను కలిపి విచారణ చేపట్టింది.

ప్రభుత్వ నిర్ణయం సుమారు 4 లక్షల మంది పెన్షనర్ల జీవితాలపై ప్రభావం చూపుతోందని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. పింఛన్​ రాజ్యాంగ పరమైన హక్కు అని... దాన్ని ప్రభుత్వం హరించవద్దని పేర్కొంటూ పలు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. పింఛన్​లో కోత విధించడం వల్ల విశ్రాంత ఉద్యోగులకు ఇబ్బందులు కలుగుతాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకవేళ ఎవరైనా పెన్షనర్​కు కరోనా వస్తే... వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించింది.

పింఛన్​దారుల విషయంలో ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించాలని గత నెలలోనే ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. విశ్రాంత ఉద్యోగులకు పూర్తి పింఛను ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్​కు సూచించింది. కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details