పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 8 నుంచి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించిన విద్యాశాఖ.. హైకోర్టు తుది అనుమతి కోసం వేచిచూస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. కరోనా జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి నివేదించింది.
హైకోర్టు ఆదేశించినా.. కొన్ని చోట్ల పరీక్ష కేంద్రాలను మార్చలేదని.. భౌతిక దూరం పాటించడం సాధ్యం కాని ఇరుకు గదులు ఉన్నాయని న్యాయవాది నగేష్ వాదించారు. ఇరుకు గదులున్న పరీక్ష కేంద్రాలను సమీపంలోని కళాశాలల్లోని విశాలమైన గదులకు మార్చినట్లు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి నివేదించారు. అలాంటి భవనాలు హైదరాబాద్లోనే 65 ఉన్నాయని చెప్పారు.
మా ఆదేశాలు పాటిస్తేనే అనుమతులు..
రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కేంద్రాలు మార్చారు.. గత నెల 19న తాము ఇచ్చిన ఆదేశాలను ఎంత మేరకు అమలు చేశారో..ఆధారాలను శనివారం సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మే 19 నాటి ఆదేశాలను పూర్తిగా అమలు చేయాలని.. లేకుంటే పరీక్షలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యమని.. అందులో రాజీపడేది లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
కంటైన్మెంట్ జోన్లుగా మారితే..
కంటైన్మెంట్ జోన్లలో పరీక్ష కేంద్రాలు లేవని ప్రభుత్వం చెబుతోందని.. రానున్న రోజుల్లో కేంద్రాలు కంటైన్మెంట్ ప్రాంతాలుగా మారితే విద్యార్థులు ఇబ్బంది పడతారని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది కె.పవన్ కుమార్ వాదించారు. కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని విద్యార్థులు కేంద్రాలకు ఎలా వెళ్తారు.. పరీక్ష కేంద్రాలున్న ప్రాంతాలు కంటైన్మెంటుగా జోన్లుగా మారితే ఏం చేస్తారో రేపటిలోగా తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.