రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రేపటి పరీక్షను యథావిధిగా నిర్వహించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిన్న పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.
పది పరీక్షలు వాయిదా.. హైకోర్టు కీలక ఆదేశాలు - పదోతరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశం
13:43 March 20
పది పరీక్షలు వాయిదా.. హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని... వాయిదా వేయాలని కోరుతూ సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అత్యవసర వ్యాజ్యంగా పరిగణించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు గుమిగూడి ఉంటున్నారని... ఒక్కో గదిలో పదుల సంఖ్యలో పరీక్ష రాస్తున్నారని... కరోనాపై ఆందోళనల నేపథ్యంలో మానసికంగా గందరగోళంతో ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ కుమార్ వాదించారు. రెండు వారాలు కీలకమని భావిస్తున్నందున... ఈనెల 23 నుంచి 30 వరకు జరిగే పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రేపటి పరీక్షను తగిన ఏర్పాట్లతో యథావిధిగా కొనసాగించాలని పేర్కొంది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన పరీక్షలపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి తెలిపింది. ఈ నెల 29 వరకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి... సమీక్షించిన తర్వాతే పరిస్థితి అంచనా వేయాలని ఆదేశించింది.
ఇవీ చూడండి:ఈ అపార్టుమెంట్‌లోకి కరోనా రాకుండా ఏం చేశారో తెలుసా?