తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలన్న ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా దరఖాస్తు చేసుకుంటే.. దానిపై ఆరు వారాల్లో చట్టపరంగా తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. భద్రత కోసం కేంద్ర హోంశాఖకు తాజాగా దరఖాస్తు చేసుకోవాలని రేవంత్ రెడ్డికి ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం
కేంద్ర బలగాలతో ఎస్కార్టు, 4 ప్లస్ 4 భద్రత కల్పించాలని కోరుతూ గతేడాది సమర్పించిన దరఖాస్తును పరిష్కరించేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న రేవంత్ రెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి గతేడాది ఆగస్టులో ఆదేశించినప్పటికీ... హోంశాఖ కార్యదర్శి ఇప్పటి వరకు స్పందించలేదని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది పి.వేణుగోపాల్ వాదించారు. పిటిషన్లో పేర్కొన్నంతగా రేవంత్ రెడ్డికి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ వాదించారు. రేవంత్ రెడ్డి తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు పేర్కొన్నారు.