కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే.. వైద్య సిబ్బందిలో ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందని, ఆ పరిస్థితులను రాష్ట్రం భరించలేదని వ్యాఖ్యానించింది.
కరోనా చికిత్సలు చేస్తున్న వైద్య సిబ్బందికి భద్రత పెంచాలని కోరుతూ కైలాష్ నాథ్ అనే వ్యక్తి రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య సిబ్బందిపై దాడి జరిగినట్లు పత్రికల్లో ప్రచురితమైన అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ టి.అమర్ నాథ్ గౌడ్లతో కూడిన ధర్మాసనం ప్రస్తావించింది. ఉస్మానియాలో వైద్యులపై దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు.