ప్రభుత్వ వాదన వినకుండా రూ.10వేల వరద సాయం పంపిణీ కొనసాగింపుపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. వరద సాయం పంపిణీ నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. న్యాయవాది శరత్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
'ప్రభుత్వ వివరణ లేకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం'
హైదరాబాద్‌లో వరదసాయం నిలిపివేత వ్యాజ్యంపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వ వివరణ లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం తెలిపింది. విచారణను డిసెంబరు 4కి వాయిదా వేసింది.
వరద సాయం నిలిపివేతపై వివరణ ఇస్తూ... ఎస్ఈసీ కౌంటరు దాఖలు చేసింది. ఓటర్లు ప్రభావితం కావద్దన్న ఉద్దేశంతో వరద సాయం పంపిణీ తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎస్ఈసీ నివేదించింది. డిసెంబరు 4 తర్వాత వరద సాయం కొనసాగించే స్వేచ్ఛ... ప్రభుత్వానికి ఉంటుందన్నారు. విపత్తుల సమయంలో సాయం చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డం కాదని పిటిషనర్ న్యాయవాది శరత్ వాదించారు. పది వేల రూపాయల పంపిణీ కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
వరద సాయం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కౌంటరు దాఖలు చేయలేదు. ప్రభుత్వ వివరణ లేకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు.. విచారణను డిసెంబరు 4కి వాయిదా వేసింది.