తెలంగాణ

telangana

ETV Bharat / city

AP High Court On Social Media : న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను మీరే దిగజారుస్తారా? - న్యాయ వ్యవస్థపై సోషల్​ మీడియాలో కామెంట్లు

AP High Court On Social Media : న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం ఏంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఎవరుపడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, వీడియోలు అప్​లోడ్​ చేయడాన్ని ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అపకీర్తి పాలుజేసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, వీడియోలు అప్​లోడ్​ చేయడంపై నమోదు చేసిన కేసులో.. బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది .

HC On Social Media
న్యాయ వ్యవస్థపై సోషల్​ మీడియాలో పోస్టులు

By

Published : Feb 18, 2022, 9:08 AM IST

AP High Court On Social Media : న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టులను అసలు సహించబోమని ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు తేల్చిచెప్పింది. న్యాయవాదులు, న్యాయవ్యవస్థను గౌరవిస్తేనే ప్రజల్లోనూ ఆ భావన కొనసాగుతుందని వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే.. ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం ఏమిటని నిలదీసింది. సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు, మరో న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ జి .రమేశ్ కుమార్ వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు ఆఫీసర్లుగా ఉంటూ న్యాయస్థానాల ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడటంపై అభ్యంతరం తెలిపింది. నిందితులను దిగువ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చినందున విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఆ అవసరం ఏమిటి

AP High Court on Social Media Posts : న్యాయవాది చంద్రశేఖరరావు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జి .రమేశ్ కుమార్‌ పోలీసు కస్టడీ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ముగియనుంది. అనారోగ్యం కారణంగా మరో నిందితుడు గోపాలకృష్ణ కళానిధి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నిందితులు పోలీసు కస్టడీ పూర్తయ్యాక కూడా జ్యుడీషియల్ రిమాండ్ ఉండాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. మూడు వ్యాజ్యాలపై విచారణను ఈనెల 21 కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈమేరకు ఆదేశాలిచ్చారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అపకీర్తి పాలుజేసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, వీడియోలు అప్​లోడ్​ చేయడంపై నమోదు చేసిన కేసులో న్యాయవాదులు మెట్టా చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ రమేశ్ కుమార్లను సీబీఐ అరెస్ట్ చేసింది. బెయిలు కోసం వారు హైకోర్టులో పిటిషన్లు వేశారు. సీనియర్ న్యాయవాదులు కేజీ కృష్ణమూర్తి, హేమేంద్రనాథ్ రెడ్డి, న్యాయవాది డి. కోదండరామిరెడ్డి నిందితుల తరపున వాదనలు వినిపించారు. న్యాయవాదులిద్దరిపై సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో క్షమాపణలు కోరారని, భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయబోమని హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో వారిద్దరిపై ధర్మాసనం కోర్టు ధిక్కరణ కేసును మూసేసిందని చెప్పారు. న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపడుతున్నారని వెల్లడించారు. సీబీఐ నమోదు చేసిన పలు సెక్షన్లు పిటిషనర్ల వ్యాఖ్యలకు వర్తించవని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్నారని బెయిలు మంజూరు చేయాలని కోరారు.

రాజకీయ కోణం

AP HC On Social Media Issue : సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు జడ్జీలపై పిటిషనర్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. రాజకీయ కోణం ఆపాదించారని ఆరోపించారు. దిగువ కోర్టు రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇచ్చిందని.. ఈ దశలో బెయిలు మంజూరు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఓ వైపు దిగువ కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చి విచారణ ప్రక్రియ జరుగుతున్నప్పుడు హైకోర్టు బెయిలు మంజూరు చేయడం న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

ఇదీ చదవండి :AP bifurcation Issues: వీడని విభజన ముడి.. నెల రోజుల్లో మరో సమావేశం..!

ABOUT THE AUTHOR

...view details