తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆత్మహత్యలు, గుండెపోటులను ప్రభుత్వం ఎలా ఆపగలదు?' - tsrtc strike latest news

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, మరణాలను నిలువరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిల్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఆత్మహత్యలు, గుండెపోటులను ప్రభుత్వం ఎలా ఆపగలదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కార్మికుల ప్రతీ సమస్యకూ.. పారిశ్రామిక వివాదాల చట్టంలో పరిష్కార మార్గాలున్నాయని పేర్కొంది.

'ఆత్మహత్యలు, గుండెపోటులను ప్రభుత్వం ఎలా ఆపగలదు?'
'ఆత్మహత్యలు, గుండెపోటులను ప్రభుత్వం ఎలా ఆపగలదు?'

By

Published : Nov 27, 2019, 5:07 AM IST

Updated : Nov 27, 2019, 8:05 AM IST

'ఆత్మహత్యలు, గుండెపోటులను ప్రభుత్వం ఎలా ఆపగలదు?'

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, గుండెపోటులను ప్రభుత్వం ఎలా ఆపగలదని పిటిషనర్​ తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావును హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, మరణాలను నిలువరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిల్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. స్వయంగా వాదనలు వినిపించిన పీఎల్ విశ్వేశ్వరరావు... సమ్మె పరిస్థితుల నేపథ్యంలో కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారని... గుండెపోటు బారిన పడుతున్నారన్నారు. ఇప్పటి వరకు సుమారు 30 మంది మరణించారని... తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

ప్రతీ సమస్యకు చట్టంలో పరిష్కారం ఉంది

దీనిపై స్పందించిన ధర్మాసనం గుండెపోటుకు ఎన్నో కారణాలుంటాయని.. సమ్మె వల్లే వచ్చిందని ఎలా చెప్పగలమని ధర్మాసనం ప్రశ్నించింది. ఆత్మహత్యలు ఆపాలని తామెలా చెప్పగలమని.. సర్కారు కూడా ఎలా ఆపగలదని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాల వల్లే కార్మికులపై ఒత్తిడి పెరిగిందని పీఎల్ విశ్వేశ్వరరావు వాదించగా... సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నది కార్మిక సంఘాల నాయకులేనని.. ప్రభుత్వం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వేతనాలు, పీఎఫ్ వంటి కార్మికుల ప్రతీ సమస్యకు.. పారిశ్రామిక వివాదాల చట్టంలో పరిష్కార మార్గాలున్నాయని తెలిపింది. అయితే వాటికి హైకోర్టు వేదిక కాదని... వ్యాధికి తగిన వైద్యుడిని సంప్రదించాలని వ్యాఖ్యానించింది. చర్చలు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరగా.. చర్చలు స్వచ్ఛందంగా జరిపితేనే ఫలితం ఉంటుంది కానీ.. బలప్రయోగంతో కాదని పేర్కొంది.

ప్రభుత్వం నుంచి స్పందన లేదు: పీఎల్​

కార్మికులు సమ్మె విరమించినప్పటికీ... ఆర్టీసీ యాజమాన్యం విధుల్లోకి చేర్చుకోవడం లేదని హైకోర్టు దృష్టికి పీఎల్ విశ్వేశ్వరరావు తీసుకెళ్లారు. కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆర్టీసీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అయితే పిటిషన్​లో అలాంటి అభ్యర్థన లేదని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్​ను సవరించుకుంటే... పరిశీలిస్తామని సూచించింది. అంగీకరించిన పీఎల్ విశ్వేశ్వరరావు... తన పిటిషన్​ను మార్చుకుంటానని హైకోర్టుకు తెలిపారు.

Last Updated : Nov 27, 2019, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details