రాష్ట్రంలో డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్షలపై ఉత్కంఠ కొనసాగుతోంది. బుధవారం నుంచి ఈ నెలాఖరు వరకు వివిధ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు జరిపేలా యూనివర్సిటీలు షెడ్యూలు ప్రకటించాయి. అయితే చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించగలరా? సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్గా పరిగణిస్తారా? అని గతంలో హైకోర్టు అడిగిన ప్రశ్నకు వివరణ ఇస్తూ రాష్ట్ర సాంకేతిక, కళాశాల విద్యాశాఖల కమిషనర్ నివేదిక సమర్పించారు.
రెగ్యులర్గా పాసైనట్టే..
ఆన్లైన్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలుకాదని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఎప్పటిలాగే రాత పరీక్ష నిర్వహిస్తామని... ఒకవేళ ఎవరైనా విద్యార్థులు ఇప్పుడు రాయలేకపోతే... సప్లమెంటరీకి హాజరు కావచ్చునని పేర్కొంది. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్గా పాసైనట్టే పరిగణిస్తామని ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. అయితే ఆటానమస్ ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు మాత్రం వారికి అనుకూలమైన రీతిలో నిర్వహించుకోవచ్చునని స్వేచ్ఛనిచ్చినట్లు పేర్కొంది. రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షల మంది డిగ్రీ.. దాదాపు 31 వేల పీజీ విద్యార్థులు చివరి సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి ఉందని.. వారిలో అటానమస్ కాలేజీల్లో దాదాపు 600 మంది ఉన్నట్టు వివరించింది.