ఏపీ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సలహాదారులనే పేరుతో 40 , 50 మందిని నియమించుకోవడం ఏమిటని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్షల్లో వారికి పారితోషికం, ఇతర ప్రయోజనాలు, వసతులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొంది. ఏపీ ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి కదా? అని వ్యాఖ్యానించింది. సలహాదారులకు కల్పించినన్ని ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకు సైతం లేవని పేర్కొంది. గతంలో నియమితులైన సలహాదారులు మీడియాతో మాట్లాడిన సందర్భాలు లేవని తెలిపింది.
ప్రస్తుతం కొంత మంది సలహాదారులు మీడియా ముందుకొచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని పేర్కొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజ శేఖర్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన కేవీపీ రామచంద్రరావు .. ప్రమాదంలో ముఖ్యమంత్రి మరణించాక ప్రజలకు ధైర్యం చెప్పడం కోసం మాత్రమే మీడియా ముందుకు వచ్చారని గుర్తుచేసింది. ఏపీ ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
గురువారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి . గవర్నర్ ముఖ్యకార్యదర్శి , ఎస్ఈసీ నీలం సాహ్ని తరపు న్యాయవాదుల వాదనల కోసం విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించడాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బి. శశిభూషణ్ రావు వాదనలు వినిపించారు.
సీఎం రాసిన లేఖతో ఎస్ఈసీ నియామకం
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఎస్ఈసీ నీలం సాహ్ని నియామకం జరిగిందన్నారు. ఆ నియామకాన్ని ప్రశ్నించే హక్కు ఓటరుగా, భారత పౌరుడిగా పిటిషనర్‌కు ఉంది. ఎస్ఈసీ నియామకంతో వ్యక్తిగతంగా నష్టపోకపోయినా రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు వ్యాజ్యం దాఖలు చేయవచ్చన్నారు. ఇదే తరహాలో తెదేపా నేత వర్ల రామయ్య జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత ఉంది అని హైకోర్టు పేర్కొంది. స్వతంత్రంగా ఉండే వ్యక్తిని ఎస్ఈసీగా నియమించాలని సుప్రీం స్పష్టంచేసింది. నీలం సాహ్ని సీఎస్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సేవలు అందించారు. ఎస్ఈసీ నియామకం కోసం గవర్నర్‌కు ముఖ్యమంత్రి పంపిన పేర్లలో ఆమెను ప్రతిపాదిస్తూ లేఖ రాశారు.
ఎస్ఈసీ నియామకం గవర్నర్ విచక్షణాధికారం మేరకు జరగాలి. ముఖ్యమంత్రి రాసిన లేఖతో ఆమె ప్రత్యేక అర్హత పొందినట్లు అయ్యింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆమె నియామకం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్రంగా ఉండే వ్యక్తిని ఎస్ఈసీగా నియమించినట్లు కాదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని నియామక ఉత్తర్వులను రద్దు చేయండి ' అని కోరారు.