తెలంగాణ

telangana

ETV Bharat / city

కర్ఫ్యూ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: హైకోర్టు

telangana High Court news today, ts high court news today
కర్ఫ్యూ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలి: హైకోర్టు

By

Published : Apr 27, 2021, 4:55 PM IST

Updated : Apr 27, 2021, 8:15 PM IST

16:51 April 27

రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలపై హైకోర్టు ఆందోళన

కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నెల 30న పురపోరు పోలింగ్​కు ఎలాంటి ఏర్పాట్లు చేశారో నివేదించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. మాస్క్​లను సరైన విధంగా పెట్టకపోయినా కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీస్ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంట్లోనే చికిత్స పొందుతున్న వారి కోసం హితం యాప్​ను వారంలోగా పునరుద్ధరించాలని ఆదేశించింది. జిల్లాల వారీగా బులిటెన్లు జారీ చేయాలని ఆదేశించింది. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వం వినతిని పరిశీలించాలని కేంద్రానికి హైకోర్టు తెలిపింది. రాత్రి కర్ఫ్యూ ఈ నెలాఖరుతో ముగియనున్నందున... ఆ తర్వాత ప్రణాళిక ఏంటో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వివరాలు లేవని అసంతృప్తి

రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో సరైన వివరాలు లేవని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు వారంలోనే రెట్టింపయ్యాయని హైకోర్టు పేర్కొంది. ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు కరోనాను మరింత వ్యాప్తి చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో... ఈ నెల 29లోగా నివేదించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా తీవ్రత ఉన్న జిల్లాల్లో శ్మశాన వాటికలు ఎన్ని ఉన్నాయి? వాటిలో సదుపాయాల వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మృత దేహాలను శ్మశాన వాటికలకు తరలించే వాహనాల వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని.. లేదా ఇప్పటికే ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. 

వారం రోజుల్లో పునరుద్ధరించాలి

కరోనా రోగులను ఆస్పత్రికి తరలించే ఉచిత అంబులెన్స్ వాహనాల్లో సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని ప్రభుత్వానికి తెలిపింది. ఇళ్లల్లో చికిత్స పొందుతున్న వారికి సహకరించేందుకు.. హితం యాప్​ను వారం రోజుల్లో పునరుద్ధరించాలని పేర్కొంది. రాత్రి కర్ఫ్యూ ఈ నెలాఖరుతో ముగియనున్నందున.. ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

ఏర్పాట్లు చేయాలి

తెలంగాణకు ఆక్సిజన్ కేటాయింపులు 431 టన్నులకు పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వివిధ రాష్ట్రాల నుంచి రైల్వేల సహకారంతో ఆక్సిజన్ తరలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఆక్సిజన్ తరలింపునకు సహాయం చేయాలని భారత వాయుసేనను హైకోర్టు కోరింది. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను పరిశీలించాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆశ్రమాల్లోని వృద్ధులు, వసతి గృహాల్లోని దివ్యాంగులు, జైళ్లలోని ఖైదీలను వ్యాక్సినేషన్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వృద్ధాశ్రమాలు, దివ్యాంగుల వసతి గృహాలు, జైల్లలోనే వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కేసులు?

కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది. భౌతిక దూరం పాటించని వారిపై నాలుగు, గుమిగుడినందుకు రెండు కేసులు నమోదు చేశామని డీజీపీ నివేదిక ఇవ్వడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కేసులు నమోదు చేయడం జోక్ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. డీజీపీ లెక్కలు నవ్వు తెప్పిస్తున్నాయని పేర్కొంది. మాస్కులు ధరించక పోవడం వల్ల ... ముక్కు నోరు పూర్తిగా మూసి వేసేలా ధరించక పోవడాన్ని కూడా నిబంధనల ఉల్లంఘన కింద పరిగణించాలని హైకోర్టు వెల్లడించింది. సరైన విధంగా మాస్కులు ధరించని వారిపై కూడా కేసులు నమోదు చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది. వారం రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.

సంబంధిత కథనం:కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నాం: ప్రభుత్వం

ఇదీ చూడండి :బ్లాక్ మార్కెట్​లో ఆక్సిజన్ సిలిండర్లు.. ముగ్గురు నిందితులు అరెస్ట్

Last Updated : Apr 27, 2021, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details