ఆర్టీసీ సమ్మెపై నిన్నటి తుది తీర్పులో హైకోర్టు కీలక అంశాలను ప్రస్తావించింది. కార్మికులను విధుల్లోకి తీసుకొనే విచక్షణను ప్రభుత్వానికి, ఆర్టీసీకే వదిలేస్తున్నామని తెలిపింది. ఆర్టీసీ, ప్రభుత్వం ఆదర్శ ఉద్యోగ సంస్థగా వ్యవహరిస్తాయని ఆశిస్తున్నామని పేర్కొంది. సమ్మె ఉద్దేశం డిమాండ్ల పరిష్కారానికే కానీ.. విధులను విడిచిపెట్టడం కాదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొందని హైకోర్టు ప్రస్తావించింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా తగినన్ని బస్సులు సమకూర్చాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
" సమ్మె చేసినంత మాత్రాన.. కార్మికులు విధులను వదిలిపెట్టినట్లుగా ప్రభుత్వం, ఆర్టీసీ నిర్ణయానికి రావద్దు. పోరాటం కేవలం కార్మికులకు, యాజమాన్యానికి మధ్య మాత్రమే కాదని ప్రభుత్వం, ఆర్టీసీ గ్రహించాలి. కార్మికులను బయటకు పంపితే.. వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయని ప్రభుత్వం, ఆర్టీసీ గుర్తుంచుకోవాలి. కేవలం 48వేల మంది కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవడం అనేది ఇక్కడ ప్రశ్న కాదు. 48వేల కుటుంబాలకు చెందిన లక్షల మందికి సంబంధించిన అంశంగా ప్రభుత్వం, ఆర్టీసీ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే వారికి మరో ఉద్యోగం దొరకడం దాదాపు అసాధ్యం. దేశంలో ఉన్న నిరుద్యోగిత, వయోపరిమితి కారణంగా మళ్లీ ఉద్యోగాలు దొరకడం అంత సులువు కాదు. తప్పు చేసిన ఉద్యోగిపై కూడా యాజమాన్యాలు ఔదార్యాన్ని పాటించాలి. కార్మికుల కుటుంబసభ్యులపై కూడా యాజమాన్యం దయ, కరుణ చూపాలి. కార్మికుల సమస్యలను వీలైనంత త్వరగా ప్రభుత్వం, ఆర్టీసీ పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాం. వివాదం పరిష్కారమయ్యే వరకూ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉంటారు."