మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు
15:45 November 19
మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఎంవీ చట్టం- సెక్షన్ 67 ప్రకారం ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఆర్టీసీ, ప్రైవేటు వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ప్రైవేటీకరణపై మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుందో చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. సీఎం ఏమన్నారన్నది న్యాయస్థానానికి సంబంధం లేదని... మంత్రివర్గ నిర్ణయం చట్టబద్ధమా, చట్ట విరుద్ధమా అనేది కోర్టు ముందున్న అంశమని స్పష్టం చేసింది.
గెజిట్‌లో ప్రచురించాలి
మార్పులు చేస్తే.. సెక్షన్ 102 ప్రకారం ఆర్టీసీకి తెలపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. చట్టం ప్రకారం మార్పులను గెజిట్‌లో ప్రచురించాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపాదిత మార్పులు స్థానిక దినపత్రికల్లో ప్రచురించాలని వివరించారు. మంత్రివర్గ నిర్ణయం ఆర్టీసీకి ముందే ఇవ్వాలా? సమావేశం తర్వాత ఇవ్వాలా? అని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.