గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితిపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలు పోతుంటే.. మరమ్మతులకు ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందని అసహనం వ్యక్తం చేసింది. విశ్రాంత ఉద్యోగి గంగాధర్ తిలక్ పింఛన్ డబ్బులతో రోడ్లను మరమ్మతు చేస్తున్నారని పత్రికల్లో వచ్చిన కథనాన్ని సుమోటోగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డిని జీహెచ్ఎంసీ నియమించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రోడ్లపై గుంతలు పూడ్చాలనే అంశంపై వాదించేందుకు ఓ సీనియర్ న్యాయవాదిని ప్రత్యేకంగా నియమించాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ భావిస్తోందా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
high court: 'ప్రజల ప్రాణాలు పోతుంటే రోడ్ల మరమ్మతులకు దశాబ్దాలు కావాలా?' - తెలంగాణ తాజా వార్తలు
16:41 July 20
ప్రజల ప్రాణాలు పోతుంటే రోడ్ల మరమ్మతులకు దశాబ్దాలు కావాలా?: హైకోర్టు
రోడ్ల మరమ్మతుల పూర్తికి ఎన్ని దశాబ్దాలు కావాలి.. ప్రజల ప్రాణాలు పోతుంటే మరమ్మతులకు దశాబ్దాలు కావాలా?... ప్రతి వర్షాకాలం నీళ్లు నిలిచే ప్రాంతాలు గుర్తించి సరిచేయాలి.. జీహెచ్ఎంసీలో వరద నీటి కాల్వలు, రోడ్ల మరమ్మతులు పెంచాలి. రాష్ట్రమంతటికీ ఆదర్శంగా నిలిచేలా హైదరాబాద్ ఉండాలి. అంతర్జాతీయంగా పేరున్న హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి అవసరం. వసతులు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి" విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు
నగరంలోని రోడ్ల అభివృద్ధి వివరాలతో హైకోర్టుకు జీహెచ్ఎంసీ నివేదిక సమర్పించింది. నగరంలోని 401 రోడ్ల అభివృద్ధి కోసం సమీకృత రహదారి అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపింది. నగరంలో 9 వేల 13 కిలోమీటర్ల రోడ్లు ఉండగా.. దాదాపు 6 వేల కిలోమీటర్లకు పైగా సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు జీహెచ్ఎంసీ వివరించింది. వర్షాకాలంలో రోడ్ల మరమ్మతులు, గుంతలు పూడ్చే పనులు రోజూ జరుగుతున్నాయని పేర్కొంది. వర్షాకాలంలో రోడ్ల మరమ్మతులు, అత్యవసర పనుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు నగర పాలక సంస్థ తెలిపింది. వర్షాకాలం మొదలై నెల రోజులైందని.. ఇంకా మరమ్మతులు ఎప్పుడు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
రోడ్లు, వరద నీటి కాలువల మరమ్మతుల వేగం పెంచాలని స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది వర్షం నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించాలని సరిచేయాలని తెలిపింది. రాజధాని హైదరాబాద్ మహానగరం రాష్ట్రమంతటికీ ఆదర్శంగా నిలిచేలా ఉండాలని హైకోర్టు పేర్కొంది. అంతర్జాతీయంగా పేరున్న హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. సదుపాయాలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడింది. వర్షాకాలంలో రోడ్ల మరమ్మతులకు ప్రణాళికలేంటో రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి:High Court: 'అధికారుల వేతనాలు ఆ దంపతులకు ఇస్తే మేలు'