శిక్ష పడదగిన ఆరోపణలతో ఫిర్యాదులు చేసినప్పుడు కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు ఎందుకు దాఖలు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. సివిల్ వివాదమన్న కారణంగా ఫిర్యాదులోని నేరారోపణల తీవ్రతను ఎలా విస్మరిస్తారని అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ... కేసులు నమోదు చేయకుండా కేవలం జీడీ ఎంట్రీ పెట్టి వదిలేస్తున్న పోలీసులపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చర్యలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోవడంపై ఆదిలాబాద్ జిల్లా బెల్లూరి గ్రామానికి చెందిన ఫిరోజ్ అహ్మద్ ఖాన్, ఎస్.చంద్రశేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేయడం వల్ల అప్పీల్ దాఖలు చేశారు. అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు ఎందుకు నమోదు చేయడం లేదు: హైకోర్టు - తెలంగాణ వార్తలు
తీవ్ర ఆరోపణలతో ఫిర్యాదు చేసినప్పుడు సివిల్ వివాదమంటూ ఎఫ్ఐఆర్ ఎందుకు చేయడం లేదని పోలీసులపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును పాటించనందుకు... పోలీసుల తీరును సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యగా ఎందుకు పరిగణనలోకి తీసుకోరాదని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పోలీసులందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని అడ్వకేట్ జనరల్‌కు ధర్మాసనం సూచించింది.
రాజకీయ నేతతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి తమ పొలంలో చొరబడి అసభ్య పదజాలంతో దూషించి పంట నష్టం చేసి చంపుతానని బెదిరించారని ఫిర్యాదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ చేయడానికి ఇబ్బందేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. శిక్షార్హమైన ఆరోపణలతో ఫిర్యాదు చేసినప్పడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని హైకోర్టు గుర్తు చేసింది. పిటిషనర్లు ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. సివిల్ వివాదమంటూ ఫిర్యాదులు తిరస్కరించడం ఇటీవల ఎక్కువగా అవుతోందని.. దీనిపై పోలీసులందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌కు ధర్మాసనం సూచించింది. పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:వీడియో వైరల్: పోటీలు పెట్టుకున్నారు.. ఆపై కొట్టుకున్నారు..!