ఏపీ ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్... తదనంతర జీవోలను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో పాటు తెలుగుదేశం నేత వర్ల రామయ్య, వడ్డే శోభనాధ్రీశ్వరరావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, న్యాయవాది తాండవ యోగేష్... పిటిషన్ వేశారు.
మార్పుల కోసమే..
ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదించటం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో రమేశ్‌కుమార్‌కు వర్తించదని... ఆ తర్వాత వచ్చే వారికి వర్తిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థలో సంస్థాగత మార్పులు తేవాలని ప్రభుత్వం భావిస్తోందని.. దీంట్లో భాగంగానే ఆర్డినెన్స్ తెచ్చారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు సమయం కావాలని ధర్మసనాన్ని అడ్వకేట్ జనరల్ కోరారు.