మల్లన్నసాగర్ భూసేకరణ వ్యవహారంలో సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలు విషయంలో అధికారులు అనుసరించిన తీరుపై గురువారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులు చెబుతున్నది పరిశీలిస్తే కేవలం కంటి తుడుపు చర్యగా అమలు చేసినట్లుందని వ్యాఖ్యానించింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లను ఇవ్వడానికి అంత యంత్రాంగం ఉన్న ప్రభుత్వానికి సాధ్యం కానపుడు, మీరిచ్చిన 4 సెట్‌ల కాపీలను 322 మంది సామాన్యులు ఎలా చదువుకుని అభ్యంతరాలను వెల్లడించాలంది. కేవలం కంటి తుడుపు చర్యగా సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేసినట్లు ఉందని పేర్కొంది. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అప్పటి భూసేకరణ అధికారి జయచంద్రారెడ్డిలకు విధించిన సాధారణ జైలు శిక్ష అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
మల్లన్నసాగర్ భూసేకరణ వ్యవహారంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి మూణ్నెల్ల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా, పిటిషనర్లకు రూ.25 వేలు ఖర్చుల కింద, తరువాత కలెక్టర్‌గా పనిచేసిన కృష్ణ భాస్కర్‌కు రూ.2 వేలు జరిమానా, భూసేకరణ అధికారి జయచంద్రారెడ్డికి 4 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానాతో పాటు పిటిషనర్లకు ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాలని తీర్పు వెల్లడైంది. దీన్ని సవాలు చేస్తూ వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీళ్లపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన గురించి ప్రశ్నించగా ప్రాజెక్టు వివరాలను తెలుగులో ఇవ్వాలని, వారి అభ్యంతరాలను వినాలని, అనంతరం పరిష్కరించి వారికి సమాచారమివ్వాలని ఆదేశించారని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ తెలిపారు. వారికి కాపీలను అందుబాటులో ఉంచామని, అభ్యంతరాలను పరిష్కరించామని చెప్పారు. 322 మందికి 5 కాపీలు పెట్టి చదువుకోమన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు.