తెలంగాణ

telangana

ETV Bharat / city

'జీవో ఉల్లంఘించిన 55 పాఠశాలలకు షోకాజ్​ నోటీసులు'

పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు, ఫీజులపై హైకోర్టులో విద్యాశాఖ కౌంటరు దాఖలు చేయగా... ధర్మాసనం విచారణ చేపట్టింది. జీవో 46ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. జీవో ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదులపై 55 పాఠశాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అధికారుల నుంచి క్షేత్రస్థాయి నివేదికలు రాగానే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని న్యాయస్థానానికి విన్నవించింది.

high court hearing on fees and online classes in schools
high court hearing on fees and online classes in schools

By

Published : Sep 18, 2020, 6:30 PM IST

ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలపై 55 పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు విద్యా శాఖ హైకోర్టుకు నివేదించింది. పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులు, అధిక ఫీజులపై హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఫీజులపై వివరణ ఇవ్వాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు శ్రీదేవసేన కౌంటరు దాఖలు చేశారు.

వివరణ ఇచ్చిన 47 పాఠశాలలు...

ఈ విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచవద్దని.. బోధన రుసుము నెలవారీగా తీసుకోవాలని పేర్కొంటూ ఏప్రిల్ 21న ప్రభుత్వం జీవో 46 జారీ చేసినట్లు తెలిపారు. జీవోను ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన 55 పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. 47 పాఠశాలలు వివరణ ఇచ్చినట్లు శ్రీదేవసేన కౌంటరులో వివరించారు. క్షేత్రస్థాయి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను అడిగామని.. రాగానే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

బోయినపల్లి సెయింట్ ఆండ్రూస్ పాఠశాల పెంచిన ఫీజులను ఉపసంహరించుకుందని తెలిపారు. సెయింట్ ఆండ్రూస్ పాఠశాలలో ఫీజులకు సంబంధించి పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. అక్కడ తల్లిదండ్రులు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదైందని పేర్కొన్నారు. బేగంపేట గీతాంజలి పాఠశాలకు షోకాజ్ నోటీసు ఇవ్వగా.. తీసుకున్న ఫీజులను రానున్న నెలలకు సర్దుబాటు చేయనున్నట్లు అంగీకరించిందని తెలిపారు. జూబ్లీహిల్స్ పాఠశాల వసూలు చేసిన అధిక ఫీజును సర్దుబాటు చేసిందని.. ఇప్పుడు బోధన రుసుము మాత్రమే వసూలు చేస్తోదంని పేర్కొన్నారు. అమీర్​పేట్​లోని నీరజ పాఠశాలు, హిమాయత్ నగర్ వాసవీ పాఠశాలపై తల్లిదండ్రుల ఫిర్యాదులు జీవో పరిధిలోకి రావని తెలిపారు.

అక్టోబరు 8కి వాయిదా...

జీవో 46కు కచ్చితంగా అమలు చేస్తామని.. ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఎస్ఈ రెండు వారాల గడువు కోరగా... విచారణను అక్టోబరు 8కి న్యాయస్థానం వాయిదా వేసింది.

ఇదీ చూడండి:పరీక్షల నిర్వహణ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details