రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి. విజయ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సలు, నివారణ చర్యలను వివరిస్తూ వైద్యారోగ్య శాఖ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో విద్యా సంస్థలు మూసివేశామని.. మాస్కులు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ప్రభుత్వం నివేదించింది. గత నెల 16 నుంచి 31 వరకు రాష్ట్రంలో 9 లక్షల 11 వేల కరోనా పరీక్షలు జరిపామని.. అందులో 7 లక్షల 63 వేలు రాపిడ్ యాంటీ జెన్, లక్షా 43 వేలు ఆర్టీపీసీఆర్ అని వివరించింది. అయితే... ప్రభుత్వం.. తప్పుదోవపట్టించే నివేదిక సమర్పించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇంత నెమ్మదిగా స్పందిస్తారా..?
ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలన్న గత ఉత్తర్వులను పాటించలేదని అసహనం వ్యక్తం చేసింది. మొత్తం పరీక్షల్లో ఆర్టీపీసీఆర్ 10 శాతం కూడా లేవని పేర్కొంది. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల కచ్చితత్వంపై అనేక అనుమానాలు ఉన్నాయని.. ఆర్టీపీసీఆర్ అత్యుత్తమ మార్గమని తెలిపింది. వరంగల్, కరీంనగర్, మేడ్చల్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్ కన్నా రాపిడ్ యాంటీజెన్ పరీక్షలపైకే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజు రోజూ నెమ్మదిగా పరీక్షలు పెంచుతున్నామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఓవైపు కరోనా రెండో దశ వేగంగా విస్తరిస్తూ.. ప్రజల ఆరోగ్యం గాల్లో తేలాడుతుంటే.. ఇంకా నెమ్మదిగానే స్పందిస్తారా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నడక దూరంలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉండాలి...
రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు, జిమ్‌లు, సినిమా థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వివాహాలు, అంత్యక్రియలు, విందుల్లో జనం గుమిగూడకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. వ్యాక్సిన్లు తగిన సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నందున.. 24 గంటలూ వ్యాక్సిన్లు వేసేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయడం లేదని ప్రశ్నించింది. ప్రజలకు నడక దూరంలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉండాలని అభిప్రాయపడింది. రాష్ట్రంలో కరోనా చికిత్స అందుబాటులో ఉన్న ఆస్పత్రుల వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ధర్మాసనం ఆదేశించింది.