తెలంగాణ

telangana

ETV Bharat / city

మెగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసిన ఏపీ హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు విషయమై గత టెండర్లను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. గతేడాది నవంబర్​లో ఏపీ రాష్ట్ర సర్కార్ పిలిచిన టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాలని ఆదేశించింది.

mega solar project, ap high court, ap high court on mega solar project
మెగా సోలార్ ప్రాజెక్టు, మెగా సౌర విద్యుత్​ ప్రాజెక్టు, ఏపీ హైకోర్టు

By

Published : Jun 18, 2021, 2:29 PM IST

మెగా సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు విషయమై గతేడాది నవంబరులో ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండరును ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ టెండర్లు పిలవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను(పీపీఏ) తాజాగా రూపొందించాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు గురువారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.

వ్యవసాయానికి 6,400 మెగావాట్ల విద్యుత్‌ అందించేందుకు ఉద్దేశించి... ఏపీలో పది సౌర విద్యుత్‌ ప్లాంట్లు/పార్కుల ఏర్పాటుకు ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీజీఈఎల్‌) గతేడాది నవంబరు 31న టెండర్లను ఆహ్వానించింది. ఆ టెండర్‌లోని రిక్వెస్ట్‌ ఫర్‌ సెలెక్షన్‌(ఆర్‌ఎఫ్‌ఎస్‌), ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు ఒప్పంద(పీపీఏ) నిబంధనలు.. కేంద్ర విద్యుత్‌ చట్టం-2003కి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌(టీపీఆర్‌ఈఎల్‌) ఈ ఏడాది జనవరిలో హైకోర్టును ఆశ్రయించింది. టెండర్‌ను రద్దుచేసి తాజాగా పిలిచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది.

పిటిషనర్‌ సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి, న్యాయవాది కిలారు నితిన్‌కృష్ణ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఇంధనశాఖ 2017 ఆగస్టు 3న జారీచేసిన బిడ్డింగ్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పంద నిబంధనలు ఉన్నాయన్నారు. ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి విద్యుత్‌ చట్టం-2003 కల్పించిన విచారణాధికార పరిధి హక్కులను ఆర్‌ఎఫ్‌ఎస్‌, పీపీఏలో తొలగించారన్నారు. దీంతో పీపీఏపై వివాదాలు తలెత్తితే.. ఏపీఈఆర్‌సీకి బదులు రాష్ట్ర ప్రభుత్వమే వాటిని పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న టెండరును రద్దు చేయాలని కోరారు. విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 63కి అనుగుణంగా తాజాగా బిడ్డింగ్‌ ప్రక్రియను చేపట్టేలా ఆదేశించాలని అభ్యర్థించారు.

ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ ప్రాజెక్ట్‌ రైతుల ప్రయోజనం కోసం తీసుకొచ్చిందన్నారు. టెండర్ల ప్రక్రియ ముగిశాక ప్రస్తుతం ఈ దశలో వ్యాజ్యం దాఖలు చేయడం సరికాదన్నారు. ఇరువైపు వాదనలూ విన్న హైకోర్టు న్యాయమూర్తి ఇటీవల తీర్పును వాయిదా(రిజర్వు) వేశారు. గురువారం నిర్ణయాన్ని వెల్లడించారు. బిడ్డింగ్‌ ప్రక్రియలో విజేతగా నిలిచిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవద్దని ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ను నిలువరిస్తూ.. ఈ ఏడాది జనవరి 7న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

మెగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసిన ఏపీ హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details