తెలంగాణ

telangana

ETV Bharat / city

Jawad Cyclone Effect: ముంచుకొస్తున్న 'జవాద్'.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం - జవాద్​ తుపాన్​ వార్తలు

Jawad Cyclone Effect: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా (జవాద్​) మారింది. విశాఖకు 420 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్​పూర్​కు 530 కిలోమీటర్ల దూరంలో 'జవాద్' కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Jawad Cyclone Effect
Jawad Cyclone

By

Published : Dec 3, 2021, 5:17 PM IST

Jawad Cyclone Effect: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రమై తుపానుగా మారింది. విశాఖకు 420 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్​పూర్​కు 530 కిలోమీటర్ల దూరంలో 'జవాద్' తుపాను కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో తుపాను తీరం వైపునకు కదులుతోందని పేర్కొంది. రేపు ఉదయానికి ఉత్తరకోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని.. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనుందన్నారు. తీరానికి వచ్చే కొద్దీ దిశ మార్చుకొని పూరీ.. వైపు వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరకోస్తా తీరంలో 80-90 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ స్పష్టం చేసింది. పలుచోట్ల 20 సెం.మీ.కి పైగా వర్షపాతం, 3.5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందన్నారు.

విశాఖలో కంట్రోల్ రూమ్​లు..


Control Rooms in Visakhapatnam: విశాఖపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు.. 0891-2590100, 2590102, 2750089, 2750090, 2560820కు ఫోన్ చేయాలని సూచించారు. జీవీఎంసీ, రెవెన్యూ, జలవనరుల శాఖ సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ మల్లికార్జున సూచించారు. తుపాను ప్రభావం దృష్ట్యా 3 రోజులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే 66 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, 55 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సిద్ధం కావాలని తెలిపారు.

తుపాను రక్షణ చర్యల్లో భాగంగా విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో 3 ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం చేసిన అధికారులు.. జీవీఎంసీ పరిధిలో 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అలాగే తుపాను దృష్ట్యా పాఠశాలలకు మూడ్రోజులు సెలవు ప్రకటించారు. రెండ్రోజులు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు అనుమతిని నిలిపివేశారు.

విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తం

జవాద్ తుపాన్ వల్ల ఏర్పడే విద్యుత్ ప్రమాదాలు, అవాంతరాలకు సంబందించిన సమాచారాన్ని అందించేందుకు ఏపీఈపీడీసీఎల్ కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేసింది. తుపాను ప్రభావానికి తెగిపడిన విద్యుత్ వైర్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపై పడిపోయిన చెట్లకొమ్మల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. వాటి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం 1912లేదా కంట్రోల్​ రూమ్ నంబర్లకు ఫోన్​ చేసి చెప్పాలని విద్యుత్ అధికారులు కోరారు. విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం -9440816373 / 8331018762 ; విశాఖపట్నం -7382299975; శ్రీకాకుళం -9490612633; విజయనగరం -9490610102; తూర్పుగోదావరి -7382299960; పశ్చిమగోదావరి -9440902926

చేపల వేటపై నిషేధం

శ్రీకాకుళం జిల్లాపైనా తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

పాఠశాలలకు సెలవు..
తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో రెండు రోజులపాటు పాఠశాలు, అంగన్​వాడీలకు సెలవు ప్రకటించారు. తుపాను సహాయక చర్యల ప్రత్యేక అధికారిగా కాంతిలాల్‌దండే నియమించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 12 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు విజయనగరానికి రానున్నట్లు కలెక్టర్​ తెలిపారు.

41 రైళ్ల రద్దు..
బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికలతో పలు ప్రాంతాలకు నడిచే 41 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రేపు, ఎల్లుండి తిరిగే దూర ప్రాంత రైళ్లను అధికారులు రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాల మీదుగా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైళ్ల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు ముందస్తుగా మొబైల్ సందేశం ద్వారా పంపనున్నట్లు తెలిపారు.

ఇదీచూడండి:'జవాద్' తుపానుగా మారిన అల్పపీడనం.. ఎన్​డీఆర్ఎఫ్​ అలర్ట్

ABOUT THE AUTHOR

...view details