ప్రముఖ దంత వైద్యులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.ఎ.ఎస్. నారాయణ, ఆయన తనయుడు డాక్టర్ మోహన్ అట్లూరిలను ‘హై9’ అనే సంస్థ ఘనంగా సత్కరించింది. ‘లైక్ ఫాదర్ లైక్ సన్’ కేటగిరీలో వీరిద్దరికి అవార్డులు ప్రదానం చేసింది. ‘హై9 హెల్త్‌కేర్ అవార్డ్స్ ఆఫ్ ద డికేడ్’’ ఈవెంట్‌లో భాగంగా దంతవైద్యంలో నిష్ణాతులైన ఈ తండ్రీకొడుకుల విశేషసేవల్ని గుర్తించి వారిని ప్రత్యేకంగా గౌరవించింది.
దంత వైద్యంలో విశేష సేవలందించిన డాక్టర్ ఎ.ఎస్. నారాయణను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, బి.సి.రాయ్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో గౌరవించిన విషయం తెలిసిందే. ఏపీలోని ఉచిత దంతవైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నోటి సంరక్షణ గురించి ఆయన అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. డాక్టర్ ఎ.ఎస్.నారాయణ తనయుడు మోహన్ అట్లూరి కూడా తండ్రి బాటలోనే ప్రఖ్యాత దంత వైద్యుడిగా ఎదిగి ఆ రంగంలో విశేష సేవలందిస్తున్నారు.