తెలంగాణ

telangana

ETV Bharat / city

డీజీపీ సూచనలు.. ఈమెయిల్‌ మోసాలకు అడ్డుకట్ట ఇలా - సైబర్ మోసాలు

ఈ మెయిల్‌ ద్వారా జరుగుతున్న మోసాల బారిన పడకుండా ఉండేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. వీటిని పాటించడం ద్వారా వ్యక్తిగతంగా ఫిషింగ్‌ ఈమెయిల్స్‌, రామ్‌సమ్‌వేర్‌ల బారిన పడకుండా చూసుకోవడంతోపాటు తాము పనిచేస్తున్న సంస్థ భద్రతను కూడా పరిరక్షించినట్లవుతుందన్నారు. ఆయన ట్విటర్‌లో ఉంచిన సూచనలివీ...

CYBER CRIMES
CYBER CRIMES

By

Published : Jun 16, 2020, 8:00 AM IST

పేరును గుడ్డిగా నమ్మవద్దు

మీకు తెలిసిన వ్యక్తి పేరుతో మెయిల్‌ వచ్చినంత మాత్రాన.. అది వారి నుంచే వచ్చిందని నమ్మవద్దు. అది నిజంగా తెలిసిన వ్యక్తి నుంచే వచ్చిందా, లేదా అన్నది నిర్ధరించుకునేందుకు మెయిల్‌ చిరునామా చదవండి.

చూడండి, క్లిక్‌ చేయవద్దు

వచ్చిన మెయిల్‌లోని ఆల్టర్‌నేట్‌ టెక్స్ట్‌(మెయిల్‌లో ప్రత్యేకంగా చిన్న డబ్బా రూపంలో ఉండే సమాచారం)లోని విషయానికి లింక్‌లో పేర్కొన్న సమాచారంతో పోలిక లేనట్లు గమనిస్తే దాన్ని క్లిక్‌ చేయవద్దు.

భాషా దోషాలు పరిశీలించాలి

మామూలు వారితో పోల్చుకుంటే హ్యాకర్లు వ్యాకరణ దోషాలపై పెద్దగా దృష్టి పెట్టరు. భాషా దోషాలను క్షుణ్నంగా పరిశీలించాలి.

సంబోధన ఎలా ఉంది?

మిమ్మల్ని ఉద్దేశించిన సంబోధన సాధారణంగా ఉందా, అస్పష్టంగా ఉందా చూడాలి. అంటే ‘వ్యాల్యూడ్‌ కస్టమర్‌,’ లేదా డియర్‌ (తర్వాత మీపేరు) వంటివి ఏమున్నాయో గమనించాలి.

మెయిల్‌లో వ్యక్తిగత సమాచారం అడుగుతున్నారా?

నిజమైన సంస్థలేవీ వ్యక్తిగత సమాచారాన్ని మెయిల్‌ ద్వారా అడగవు.

తొందరపెడుతున్నారా?

ఇలాంటి ఈమెయిల్స్‌లో అత్యవసర పరిస్థితి కనిపిస్తుంటుంది. ఉదాహరణకు నైజీరియా రాజకుమారి సమస్యల్లో ఉంది, వంద డాలర్లు ఇస్తే మిలియన్‌ డాలర్ల రివార్డు దక్కించుకోవచ్చు అంటూ ఆశపెడుతుంటారు.

ఎటాచ్‌మెంట్లతో జాగ్రత్త

నేరగాళ్లు ఆసక్తి రేకెత్తించే ఎటాచ్‌మెంట్లు పంపించడం ద్వారా బోల్తా కొట్టించాలని చూస్తారు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌ స్ప్రెడ్‌షీట్ల వంటి ఐకాన్‌లు జతచేస్తారు. కానీ అది మీరు అనుకునే స్ప్రెడ్‌షీట్‌ కాకపోవచ్చు.

భిన్నంగా ఉంటే అనుమానించాలి

మామూలుగా ఉండేదాని కంటే(వచ్చిన మెయిల్‌) భిన్నంగా ఉందనిపిస్తే ‘మన్నించండి’ అని సమాధానం చెప్పడమే ఉత్తమం. అసలు పూర్తిగా అసంబద్ధంగా ఉంటే వెంటనే మీ సంస్థ సెక్యూరిటీ ఆపరేషన్‌ సెంటర్‌(ఎస్‌ఓసీ)కు ఫిర్యాదు చేయండి.

అనుమానం వస్తే ఎస్‌ఓసీని సంప్రదించాలి

వచ్చిన మెయిల్‌పై ఏదైనా అనుమానం వస్తే.. అది ఎలాంటిదైనా, సమయం ఏదైనా ఎస్‌ఓసీకి ఫిర్యాదు చేయండి. లేకపోతే మొత్తం సంస్థనే ప్రమాదంలో పడేసినట్లవుతుంది.

ఇదీ చదవండి:కరోనా టెస్టులు, చికిత్సల ధరలను ప్రకటించిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details