ప్రాణహిత నది నుంచి గోదావరికి భారీ వరద వస్తోంది. రోజు రోజుకు పెరుగుతోంది. బుధవారం సాయంత్రం నాటికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద నదిలో 7.50 మీటర్ల మట్టం నమోదవుతోంది. 1.60 లక్షల క్యూసెకుల ప్రవాహం నమోదయింది.
దీంతో లక్ష్మీ బ్యారేజీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలేస్తున్నారు. ఇక్కడి నుంచి కన్నెపల్లి పంపు హౌస్ ద్వారా అన్నారం జలాశయానికి వచ్చే వారం నీటిని ఎత్తిపోయనున్నట్లు సమాచారం. ఎల్లంపల్లి జలాశయం నుంచి మధ్యమానేరు ద్వారా కాలువల నుంచి చెరువులను ఇప్పటికే నింపే ప్రక్రియ చేపడుతున్నారు.
ఈ లోగా ఎగువ నుంచి వరద రాకపోతే లక్ష్మీ నుంచి అన్నారం అక్కడి నుంచి సుందిళ్లకు ఎత్తిపోయాలని భావిస్తున్నారు.శ్రీరామసాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా బుధవారం 1073.60 వరకు ఉంది. 36.53 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
కాకతీయ కాల్వ ద్వారా ఆరువేల క్యూసెకులకు పెంచి నీటిని విడుదల చేస్తుండగా, లక్ష్మీకాల్వ ద్వారా 100 క్యూసెకులు, అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా 720, గుత్ప ఎత్తిపోతల ద్వారా 270, తాగునీటికి 152 క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఎగువ ప్రాంతం నుంచి 6654 క్యూసెకుల వరద నీరు వచ్చి చేరింది.