తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉద్ధృతంగా మూసీ.. ఉప్పొంగుతున్న హిమాయత్​సాగర్ - హుస్సేన్​సాగర్​కు వరద ప్రవాహం

భారీ వర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో వరద ప్రవాహం అమాంతం పెరిగింది. ఎగువ ప్రాంతాల్లోనూ ఎడితెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం వల్ల మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. హిమాయత్‌సాగర్‌కు వరద పోటెత్తగా... గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌ గరిష్ఠ నీటి మట్టానికి చేరుకుంది.

heavy water flow for himayatsagar and hussain sagar
ఉద్ధృతంగా మూసీ.. ఉప్పొంగుతున్న జంట జలాశయాలు

By

Published : Oct 14, 2020, 8:05 PM IST

ఉద్ధృతంగా మూసీ.. ఉప్పొంగుతున్న జంట జలాశయాలు

హైదరాబాద్​లోని జంటజలాశయాలు ఉప్పొంగుతున్నాయి. హిమాయత్​సాగర్‌కు భారీగా వరద నీరు వస్తున్నందున... గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. జలాశయానికి 25వేల క్యూసెక్కులకుపైగా వరద పోటెత్తుతోంది. వరద మరింతగా పెరిగే ప్రమాదముండటం వల్ల మరిన్ని గేట్లు ఎత్తే అవకాశముంది. హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు కూడా పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వరద ప్రవాహానికి భారీగా వర్షం కూడా తోడై... హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ 513 మీటర్లు కాగా... ఇప్పటికే గరిష్ఠ మట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్, దోమలగూడ, అశోక్‌నగర్‌, కవాడిగూడ వంటి పరిసర ప్రాంతవాసులు భయాందోళనలో ఉన్నారు.

ఏరూ.. ఊరూ ఏకమై..

మూసీ నీరు కాలనీల్లోకి చేరి, పరిసర ప్రాంత ప్రజలు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నందున... ఛాదర్‌ఘాట్ పరిసర ప్రాంతవాసులు బిక్కుబిక్కమంటూ గడుపుతున్నారు. జియగూడా పురాణాపూల్​లో మూసీ నది ఉప్పొంగి... బైపాస్ రోడ్డుపైకి చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ఉద్ధృతికి ఏరూ, ఊరు ఏకమైంది. మూసారాంబాగ్ వద్ద మూసీ వరదకు పరిసరాలు చెరువును తలపిస్తున్నాయి. ఎక్కడ రోడ్డుందో... నాలా ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఇదే మొదటిసారి..!

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామం వద్ద మూసీ నీరు గట్టుని తాకి ప్రవహిస్తోంది. వరద ఇంకొంత పెరిగితే గ్రామం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకునే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులు వర్షాలతోపాటు హిమాయత్​సాగర్ జలాశయం గేట్లు తెరవనున్నందున బిక్కుబిక్కుమంటున్నారు. మానాయికుంట, లక్ష్మీదేవి కాల్వలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఊళ్లో పుట్టి పెరిగిన నాటి నుంచి మూసీలో ఇంత వరద ఎప్పుడూ చూడలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

తస్మాత్ జాగ్రత్త..

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్‌ వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దాదాపు వంతెనకు తాకేస్థాయిలో మూసీ ప్రవహిస్తుండటం వల్ల మఠంపల్లి, దామరచర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాలకీడు మండలంలో పంటలు నీట మునిగాయి. మూసీ పరివాహకంలో ఎటువంటి ప్రాణనష్టం జరుగకుండా ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున... ప్రజలెవరూ అటువైపుగా వెళ్లవద్దని సూచిస్తున్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలున్నందున మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

ఇదీ చూడండి:నిండుకుండల్లా చెరువులు.. పూర్తిస్థాయి నీటిమట్టాలతో కళకళ

ABOUT THE AUTHOR

...view details