రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గత నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా గరిష్ఠంగా 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సెగలు కక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి జనం పగటి వేళల్లో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, మెదక్, నిజామాబాద్‌లలో సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే చివరి నాటికి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాగ్రత్త వహించాల్సిందే..
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ మొదటి వారంలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకూడదని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగుతో పాటు నీళ్లు, మజ్జిగ వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
ప్రజలు ఉక్కిరి బిక్కిరి
భానుడి ప్రకోపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా శీతల పానీయాలు సేవిస్తూ చెట్ల నీడన సేద తీరుతున్నారు. వేసవిలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లేటపుడు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువగా ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.
తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు ఇదీ చదవండి :అంతర్జాల సేవలకు ఆమెజాన్ ఉపగ్రహం!