తెలంగాణ

telangana

ETV Bharat / city

పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా పన్నులు.. వాహనదారులు నిలువుదోపిడి - petrol and diesel prices

పెట్రోల్‌, డీజిల్‌పై భారీ ఎత్తున పన్నులు విధిస్తూ.. వాహనదారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. లీటరు 33.33 రూపాయిలుగా ఉన్న ముడి చమురుపై... అటు ఎక్సైజ్‌ సుంకం, ఇటు వ్యాట్‌ల పేరుతో మూడింట రెండింతలు ప్రజలపై భారం మోపుతున్నాయి. గడిచిన ఏడేళ్ల కాలంలో... పెట్రోల్‌పై 23.42 రూపాయలు... డీజిల్‌పై 28.24 రూపాయలు... కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని అదనంగా వసూలు చేస్తూ... పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోంది.

Heavy taxes on petrol and diesel
Heavy taxes on petrol and diesel

By

Published : Jun 17, 2021, 4:12 AM IST

పెట్రోల్‌ ఉత్పత్తులపై చమురు సంస్థలు ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో సైతం పెట్రోల్‌ ధర వంద మార్క్‌ను దాటింది. రోజు మార్చి రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.ఈ ధరలకు కళ్లెం పడే అవకాశాలు కనుచూపు మేర కనిపించడం లేదు. రోజువారీ ధరల నిర్ణయం మాటున... పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ఆధారంగానే తాము రోజువారీ ధరలను నిర్ణయిస్తున్నట్లు చమురు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం పోటీ పడి.. పన్నుల భారం మోపడం కారణంగానే ఈ ధరలు ఇంతగా పెరుగుతున్నాయి. 2014లో ఏడేళ్ల కిందట పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం 9.48 రూపాయలు ఉండగా.. డీజిల్‌పై 3.56 రూపాయలుగా ఉంది. గడిచిన ఏడేళ్ల కాలంలో.. పెట్రోల్‌పై 23.42 రూపాయలు... డీజిల్‌పై 28.24 రూపాయలు ఎక్సైజ్‌ సుంకాన్ని అదనంగా పెంచి.. పెట్రోల్‌పై 32.90 రూపాయలు... డీజిల్‌పై 31.80 రూపాయలు... ఎక్సైజ్‌ సుంకం ప్రస్తుతం విధిస్తున్నారు.

ముడి చమురు ధరల దగ్గర నుంచి.. పెట్రోల్‌, డీజిల్‌లుగా ప్రాసెసింగ్‌ చేయడం, వాహనదారులకు అమ్మడం వరకు పరిశీలన చేసినట్లయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌లు విధిస్తున్నాయో అర్థమవుతోంది. బుధవారం అంతర్జాతీయ మార్కెట్‌లో 159 లీటర్ల సామర్థ్యం కలిగిన బ్యారెల్‌ ముడి చమురు ధర సుమారు 72 డాలర్లు. దేశీయ కరెన్సీలో ఒక్కో డాలరు మారకం విలువ 73.31 రూపాయలుగా ఉంది. అంటే భారత్‌ కరెన్సీలో ఒక్క బ్యారెల్‌ ముడి చమురు ధర దాదాపు 5 వేల 300 రూపాయలు ఉంది. అంటే ఒక్కో లీటరు ముడి చమురు ధర 33.33 రూపాయలుగా చెప్పొచ్చు. లీటరు ముడి చమురును పెట్రోల్‌గా.. ప్రాసెసింగ్‌ చేసేందుకు, రీఫైనరీ మార్జిన్లు, ఫ్రైట్‌ ఖర్చులు, లాజిస్టిక్స్‌, ఓఎంసీ మార్జిన్‌లు అన్ని కలిసి లీటరుపై 3.60 రూపాయలు..., డీజిల్‌గా ప్రాసెసింగ్‌ చేసేందుకు లీటరుపై 6.10రూపాయలుగా ఉంది. అంటే ఒక్కో లీటరు పెట్రోల్‌ ధర 36.93 రూపాయలు.. లీటరు డీజిల్‌ ధర 39.43 రూపాయలుగా ఉంది.

ఇక్కడ వరకు బాగానే ఉంది.. ఇక్కడ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాదుడు మొదలవుతుంది. ఎక్సైజ్‌ సుంకం పేరున కేంద్రం ఒక్కో లీటరు పెట్రోల్‌పై 32.90 రూపాయలు.. డీజిల్‌పై 31.80 రూపాయలు విధిస్తోంది. దీంతో పెట్రోల్‌ లీటరు 69.83రూపాయలు.. డీజిల్‌ లీటరు 71.23 రూపాయలు అవుతోంది. అయితే ఈ మొత్తంపై పెట్రోల్‌, డీజిల్‌ విక్రయించేందుకు డీలర్లకు పెట్రోల్‌ లీరుపై 3.79 రూపాయలు... డీజిల్‌పై 2.59 రూపాయల లెక్కన చమురు సంస్థలు కమిషన్‌ ఇస్తున్నాయి. ఎక్సైజ్‌ సుంకం, డీలర్ల కమిషన్‌ రెండింటిని కలిపిన తరువాత పెట్రోల్‌ లీటరు ధర 73.62 రూపాయలు... డీజిల్‌ లీటరు ధర 73.82రూపాయలుగా ఉంది. ఇక్కడ వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన ధరలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఆయా రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను-వ్యాట్‌ ఆధారంగా ధరలు ఉంటాయని చమురు సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే...పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27శాతం లెక్కన వ్యాట్‌ విధిస్తోంది. అంటే పెట్రోల్‌ లీటరుపై 25.91 రూపాయలు... డీజిల్‌ లీటరుపై 19.93రూపాయలు నేరుగా వ్యాట్‌ భారం పడుతోంది. అంటే లీటరు పెట్రోల్‌ ధర 99.53రూపాయలు... డీజిల్‌ లీటరు ధర 93.75 రూపాయలకు చేరింది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ వివిధ ప్రాంతాలకు రవాణా చేసేందుకు అయ్యే వ్యయం ఆధారంగా... రోజువారీ విక్రయాల ధరలు అమలులో ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.

మొత్తం మీద ముడి చమురు లీటరు ధర 33.33 రూపాయలను ఈ మొత్తంలో నుంచి తీస్తే...లీటరు పెట్రోల్‌పై 66.20 రూపాయలు... డీజిల్‌పై 60.42 రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతున్నాయి. చమురు సంస్థలు రోజు మార్చి రోజు ధరలను పెంచుకుంటూనే పోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గే అవకాశాలు ఏ మాత్రం లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి.... అవి విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌లను కొంత వరకైనా తగ్గిస్తే తప్ప... పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశమే లేదని చమురు సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:KTR: రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details