కరోనా వైరస్ ప్రభావంతో ఈ ఏడాది గణపతి నవరాత్రుల శోభ తగ్గినా... విగ్రహాల సంఖ్య మాత్రం తగ్గలేదు. ప్రతి ఇంట్లో ప్రతిష్టించిన చిన్న చిన్న గణనాధులను నిమజ్జనం కోసం వేల సఖ్యలో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాలకు వస్తున్నారు. ఇందు కోసం వివిధ శాఖల అధికారులతో కలిసి పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా వివిధ పోలీసు విభాగాల నుంచి 15వేల మందికి పైగా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇప్పటి వరకు నిమజ్జనాల కోసం ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ లలో 21 క్రేన్లను అందుబాటులో ఉంచారు. అవసరమైతే మరికొన్ని ఏర్పాటు చేస్తామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. పాతబస్తీతో పాటు ట్యాంక్ బండ్‌కు వచ్చే అన్ని దారుల సీసీటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసుల ఉన్నతాధికారుల పరిశీలిస్తారు. ప్రతి ప్రధాన కూడళ్లో డీసీపీ స్థాయి అధికారితో గణపతులతో వచ్చే వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పకుండా రూట్‌మ్యాప్ సిద్దం చేశారు. రోడ్డు, నాళా మరమ్మతులు జరుగుతున్న చోట దారి మళ్ళిస్తూ... ఆయా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. బందోబస్తుకు సంబంధించి సీపీ అంజనీ కుమార్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.