Cyclone Asani: పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో 'అసని' తుపాను తీవ్రంగా మారింది. పోర్టుబ్లెయిర్‌కు వాయవ్య దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై.. వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరానికి వచ్చే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలుండగా.. ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముండటంతో.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. తీరానికి దగ్గరగా వచ్చాక.. తుపాను దిశ మార్చుకుని బెంగాల్ వైపు పయనించనున్నట్లు పేర్కొంది.
వర్షాలు..: తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. భీకర గాలుల ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పిడుగులు పడి పలువురు మృతి చెందారు. చాలా చోట్ల రహదారులు జలమయం అయ్యాయి. కోనసీమ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కల్లాల్లోనే ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు తంటాలుపడ్డారు. రావులపాలెంలో ఈదురుగాలులు అలజడి సృష్టించాయి. బలమైన గాలుల ధాటికి రెండు ఆర్టీసీ బస్సుల అద్దాలు ఊడిపోయాయి. సూపర్ లగ్జరీ బస్సు విజయవాడ నుంచి కాకినాడ వెళ్తుండగా అకస్మాత్తుగా డ్రైవర్ ముందు అద్దం.. ఊడి కింద పడిపోయింది. రావులపాలెం డిపోకు చెందిన మరో బస్సు అద్దం ఊడి పడింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ధాన్యం రాశులు కల్లాల్లోనే ఉండగా.. తడవకుండా రైతులు జాగ్రత్తపడ్డారు.