రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. భారీ వర్షానికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ 65వ నెంబర్ జాతీయ రహదారిపై వరద చేరడం వల్ల హైదరాబాద్- ముంబయి మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. అల్గోల్-జహీరాబాద్, బీదర్- జహీరాబాద్ రోడ్లపైకి వరద నీరు చేరడం వల్ల పోలీసుల పర్యవేక్షణలో రాకపోకలను కొనసాగించారు. కొత్తూరు నారింజ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షం కారణంగా అల్లం, చెరకు, అరటి, సోయా, పత్తి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయం గర్భగుడి మునిగిపోయింది. సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్-తెర్పోల్ వంతెనపైకి నీరు చేరింది. సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడం వల్ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మంజీరా నది ఉద్ధృతికి ఏడుపాయల ఆలయం నీటిలో చిక్కుకుంది . జహీరాబాద్ ముంపు కాలనీల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు పర్యటించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
నిలిచిన రాకపోకలు
వరంగల్ నగరం వరదలో చిక్కుకుంది. హన్మకొండలోని పలు కాలనీలు, ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. నాలాలపై నిర్మాణాలు చేపట్టడం వల్ల వరద రోడ్డుపైకి చేరింది. జనగామ జిల్లాలో పలుచోట్ల వాగులు రహదారులపై ప్రవహిస్తుండడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. జనగామ-హైదరాబాద్ రహదారిపై నీరు ప్రవహిస్తుండడంతో వాహనాలను సూర్యాపేట వైపు మళ్లించారు. చీటూరు వాగు పొంగిపొర్లుతుండడం వల్ల జనగామ-పాలకుర్తికి రాకపోకలను నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు ఉద్ధృతికి తొర్రూరు -నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల చెరువులో చేపలు పట్టేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో కురిసిన వర్షాలకు ఖమ్మం-వరంగల్ రహదారిపై వృక్షాలు విరిగిపడ్డాయి. జాతీయరహదారిపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరంగల్‌లో పరిస్థితిని పరిశీలించడానికి వచ్చిన మేయర్ గుండా ప్రకాష్‌రావును కాంగ్రెస్‌శ్రేణులు అడ్డుకున్నారు. నాలాలను వెడల్పు చేసి కాలనీలు జలమయం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.