ఎడతెరిపిలేని వానలు.. చెరువులను తలపించిన ఉస్మానియా ఆస్పత్రి వార్డులు ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉస్మానియాలో..
వందేళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వార్డులు చెరువులను తలపించాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆస్పత్రిలోకి వర్షం నీరు ప్రవేశించింది. వార్డులు జలమయం అయ్యాయి. సరైన మురుగునీటి వ్యవస్థ లేక... డ్రైనేజీ నీరుతో వర్షపు నీరు కలిసి ప్రవహించింది. వైద్య సిబ్బంది కోసం తీసుకువచ్చిన పీపీఈ కిట్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సూపరింటెండెంట్ కార్యాలయం, సెంట్రల్ స్టెరిలైజేషన్ విభాగం, పురుషుల వార్డులోకి నీరు చేరింది. వైద్యులు, రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు.
జంట నగరాల్లో ఎంజే మార్కెట్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్ వద్ద కురిసిన వర్షానికి వాహనాదారులు తడిసి ముద్దయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. కాలనీవాసులు నానావస్థలు పడ్డారు. చిలకలగూడ, మారేడుపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్‌లో రెండు గంటల పాటు వానపడింది. మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది.
అత్యధికంగా 19.4 సెంటీమీటర్ల వర్షపాతం
రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల 10 నుంచి 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా అన్నానగర్‌లో అత్యధికంగా 19.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మంచిర్యాలలోని కొత్తపల్లి 12.9, సిద్దిపేటలోని వెంకట్రావుపేట 12.6, సూర్యాపేటలోని తిరుమలగిరి 12.1, కామారెడ్డిలోని సోమూర్ 11.2, హైదరాబాద్ కూకట్‌పల్లి 9.4, మూసాపేట్‌లో 8.4 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో వరుణుడి ప్రతాపానికి వాహనాలు నీట మునిగాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలో చెరువులు జలకళను సంతరించుకున్నాయి.
అంత్యక్రియలకు వెళ్లి..
భద్రాద్రి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. కొత్తగూడెం పాల్వంచలోని కేసీఆర్ నగర్, వెంకటేశ్వర హిల్స్, శివనగర్ కాలనీల్లో నీటి ఉద్ధృతికి 4 ఇళ్లు కొట్టుకుపోయాయి. మరో 26 పాక్షికంగా దెబ్బతిన్నాయి. కేసీఆర్ నగర్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లిన ఇద్దరు వృద్ధులు వరదలో చిక్కుకోగా స్థానికులు కాపాడారు. పాల్వంచ- కొత్తగూడెం ప్రధాన రహదారిపై రెండు మీటర్ల ఎత్తున నీరు ప్రవహించింది. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని నిరాల, బాలాపూర్, ఆకోలిలోని పంటపొలాల్లోకి నీరు చేరింది.
కర్ణాటక ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని... ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవీచూడండి:ఆ ప్రభావంతోనే విస్తారంగా వర్షాలు: ఐఎండీ అధికారి