తెలంగాణ

telangana

ETV Bharat / city

Rain Effect: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వరుణుడు.. మరో రెండురోజులు ఇదే పరిస్థితి - heavy rains updates

రాష్ట్రాన్ని వరుణుడు అతలాకుతలం చేస్తున్నాడు . శనివారం సాయంత్రం నుంచి కురిసిన కుండపోత వర్షానికి అన్ని జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. రోడ్లు నీట మునగటంతో రాకపోకలు స్తంభించి... జనాలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

heavy rains in telangana and Rain water standing in low level places
heavy rains in telangana and Rain water standing in low level places

By

Published : Sep 5, 2021, 12:11 PM IST

Updated : Sep 5, 2021, 12:40 PM IST

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వరుణుడు.. మరో రెండురోజులు ఇదే పరిస్థితి

రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కురిసిన కుండపోత వర్షం జనాలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. వర్షం తగ్గినా.. దాని తాలూకు ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్పందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్​లో..

కుంభవృష్టిలా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ ప్రజలు అల్లాడుతున్నారు. అరగంట నుంచి గంట వ్యవధిలోనే శనివారం మధ్యాహ్నం ఏకధాటిగా పలు ప్రాంతాల్లో వాన పడింది. రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎగువ నుంచి భారీ వరద రావడంతో మూసారాంబాగ్‌ బ్రిడ్జి నీట మునిగింది. అంబర్‌ పేట, దిల్‌సుఖ్‌నగర్‌ మధ్య సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. యాకత్‌పురా లోతట్టు బస్తీ, సైదాబాద్‌లోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద చేరింది. అంబర్‌పేటలోని ఆబ్కారీ కార్యాలయంలో అడుగు లోతు నీరు నిలిచింది.

యాదాద్రిలో...

యాదాద్రి భువనగిరి జిల్లాలోని మూసీ నదికి వరద పోటెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా నిన్న 355.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా సంస్థాన్ నారాయణపురంలో 109 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆలేరు, రాజపేట, యాదగిరిగుట్ట, వలిగొండ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలోని సంగెం-బొల్లేపల్లి గ్రామాల మధ్య ఉన్న భీమలింగం వద్ద లోలెవెల్ బ్రిడ్జిపై నుంచి మూసి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. సంగెం-బొల్లేపల్లి పరిసర గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక కేంద్రం జలమయమైంది. స్థానిక చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. ఆ నీళ్లతో జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. రోడ్డు పక్కనే ఉన్న వ్యాపార సముదాయాల్లోకి నీరు ప్రవేశించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

రంగారెడ్డిలో..

రంగారెడ్డి జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వానకు అబ్దుల్లాపూర్‌మెట్​​లోని చింతలచెరువు నిండి పొంగిపొర్లుతోంది. విజయవాడ జాతీయ రహదారి మీదుగా ఇనాంగూడ వద్ద బాట చెరువు అలుగు పారుతోంది. బాట చెరువు అలుగు పారడంతో విజయవాడ హైవే మీదకు నీరొచ్చి.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటి వల్ల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానిక పోలీసులు ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాటసింగారం నుంచి మజీద్​పూర్​కు వెళ్లే దారిలోని వాగు, లష్కర్​గూడ వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి. ఈ వాగుల వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి రాకపోకలు నిలిపివేశారు.

సిరిసిల్లలో...

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. భారీ వర్షానికి పట్టణంలోని పాత బస్టాండ్​తో పాటు పలు కాలనీలు నీట మునిగాయి. కొత్త చెరువు మత్తడి దూకుతుండటం వల్ల దిగువన ఉన్న శాంతినగర్, అంబేడ్కర్​నగర్, తదితర కాలనీలలో ఇళ్లలోకి నీరు చేరి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిరిసిల్ల- కరీంనగర్ ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది.

సిద్దిపేటలో...

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద ఉన్న మోయ తుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారి వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో సిద్దిపేట- హన్మకొండ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపేశారు. వంతెనపై నుండి వాగు ఉధృతంగా ప్రవహించడం ఈ వానాకాలంలో ఇది ఆరోసారి కావటం గమనార్హం. పోరెడ్డిపల్లి, నాగసముద్రాల మీదుగా హన్మకొండకు వాహనాలను దారి మళ్లించారు.

కామారెడ్డిలో...

కామారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగిరెడ్డి పేట్ మండలంలో 17.5 సె.మీ, మాచారెడ్డి మండలంలో 11సె. మీ., మద్నూర్, ఎల్లారెడ్డి మండలాల్లో 6 సెం.మీ.ల వర్షం పడింది. నాగిరెడ్డిపేట్ మండలంలోని వర్షాలకు పోచారం ప్రాజెక్టు అలుగు పారుతోంది. పూర్తి నీటి మట్టానికి చేరి గేట్లు లేకుండా నిర్మించిన ప్రాజెక్టు గోడపై నుంచి నీళ్లు కిందకు పారుతున్నాయి. ఈ దృశ్యం జలపాతాన్ని తలపిస్తోంది.

ఆదిలాబాద్​లో...

ఆదిలాబాద్​లో కురిసిన వర్షానికి వాగులు పొంగుతున్నాయి. నేరడిగొండ మండలం శంకరాపూర్​కు వద్ద ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పొలం నుంచి ఎడ్లబండిపై ఇంటికి వెళ్తోన్న ఇద్దరు సోదరులు వాగులో కొట్టుకుపోయారు. దాదాపు కిలోమీటర్ దూరం కొట్టుకుపోగా... గమనించిన గ్రామస్థులు కష్టపడి వాళ్లను కాపాడారు. ఈ ఘటనలో ఓ ఎద్దు మృత్యువాత పడింది.

వికారాబాద్​లో...

వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలు స్తంభించాయి. గర్భిణీని ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. తాండూరు మండలం బెల్కటూర్‌ వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. ఈ క్రమంలో బెల్కటూర్‌కు చెందిన గర్భిణీని రైలు పట్టాలపై తరలించారు. తాండూర్ హైదరాబాద్ మార్గంలో రాకపోకలు వారం రోజులుగా నిలిచిపోయాయి. ధారూరు మండలం దోర్నాల వాగు వద్ద వరదలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. దోర్నాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు స్టేషన్ ధారూరులో పీర్ల పండుగకు డప్పులు కొట్టడానికి వెళ్లిన వీరు... స్థానికులు వారిస్తున్నా వినకుండా వాగు దాటేందుకు ప్రయత్నించారు. ఇద్దరు నీటిలో పడిపోగా.. ఒకరిని కాపాడారు. గల్లంతైన గోరయ్య అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

మహబూబ్​నగర్​లో...

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీటితో జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలైన రామయ్యబౌళి, శివశక్తి నగర్‌, బీకేరెడ్డి కాలనీలలో ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన వర్షంతో.. నీటి ఉద్ధృతి పెరిగి పెద్ద చెరువు అలుగు పారింది. ఒక్కసారిగా నీరు దిగువకు రావడంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. పట్టణంలోనే సుమారు 10 సెంటిమీటర్ల వర్షం నమోదైంది. విషయం తెలుసుకున్న ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌... జలమయమయిన లోతట్టు ప్రాంతాల్లో తెల్లవారుజామున అధికారులతో కలిసి పర్యటించారు. నీరు చేరిన ప్రాంతాలలో తిరిగి కాలనీవాసులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇదీ చూడండి:

HEAVY RAIN EFFECT: రాజధానిలో కుండపోత.. అరగంటలో అతలాకుతలం

Last Updated : Sep 5, 2021, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details