అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు(rains) కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. పట్టణంలోని రహదార్లు జలమయమయ్యాయి. ఈపురుపాలెం, వేటపాలెం ప్రాంతాల్లో కూడా భారీ వర్ధం నమోదైంది.
తడిసిముద్దైన నగరం
విజయవాడ నగరం తడిసిముద్దవుతోంది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాలలో భారీగా వానపడుతోంది. మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కాలువల నీరు, చెత్తాచెదారాలు రహదారులపైకి వస్తుండడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మహాత్మాగాంధీ రోడ్డు, బెంజిసర్కిల్, పటమట, ఆటోనగర్, కానూరు ప్రాంతాల్లో కాలువల నుంచి నీరు బయటకొచ్చి రోడ్లపై పారుతుండడంతో.. తీవ్ర దుర్గందం వెదజల్లుతోంది. మొగల్రాజపురం, చుట్టు గుంట, భవానీపురం తదితర ప్రాంతాల్లోని రహదారులు జలమయం అయ్యాయి. ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగించేందుకు జనం అవస్థలు పడుతున్నారు. వన్‌టౌన్ సహా ఇతర లోతట్టు ప్రాంతాలు, కాలనీల చుట్టూ వాన నీరు నిలిచింది. విజయవాడ చుట్టుపక్కల కంకిపాడు, తోట్లవల్లూరు, పెనమలూరు, గన్నవరం తదితర మండలాల్లోనూ భారీగా వర్షం కురుస్తోంది.
రాకపోకలకు అంతరాయం
కృష్ణా జిల్లా గన్నవరం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా చెన్నై-కోల్‌కతా రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కేసరపల్లి, గౌడపేట, సావరగూడెంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గన్నవరం-ఆగిరిపల్లి ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది. గొల్లనపల్లి వద్ద పోలవరం కాల్వపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు.