ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్దఎత్తున వరద నీటి ప్రవాహం జిల్లాలోని ప్రాజెక్టులకు వచ్చి చేరుతుంది. ప్రధానంగా పింఛ జలాశయం, అన్నమయ్య ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రవహిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులో చేరడంతో ప్రాజెక్టు మట్టికట్ట రాత్రి తెగిపోయింది. 0.32 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు... నాలుగు గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి పెద్దఎత్తున ప్రవాహం అన్నమయ్య ప్రాజెక్టు లోకి వచ్చి చేరుతోంది. 2.37 టీఎంసీల సామర్థ్యం ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులకు వదులుతున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కూడా తెగిపోవడంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలలో కూడా అప్రమత్తం చేశారు. రాజంపేట, పెనగలూరు, నందలూరు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వాన బీభత్సం..
కుండపోత వర్షంతో ఏపీ చిత్తూరు జిల్లా (chittoor district)లోని తిరుమల( heavy rains in tirumala) గిరులు భయోత్పాతాన్ని సృష్టించాయి. ఆలయ పరిసరాలన్నీ వరద నీటి(flood water) తో నిండిపోయాయి. మాడవీధులన్నీ వాగులను తలపించాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో తిరుమల (tirumala) పరిస్థితులు భీతావహమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లోకి నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పోటెత్తిన వరద, బురద నారాయణగిరి వసతి సముదాయంలోకి చేరింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని సరిహద్దుల్లోని అల్పపీడనం.. గురువారం ఉదయం 8.30 గంటలకు వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఇది.. నేటి తెల్లవారుజామున చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ‘గురువారం సాయంత్రం 5.30 గంటలకు చెన్నైకి ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 120 కి.మీ, కరైకాల్‌కు తూర్పు ఈశాన్యంగా 150 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు వద్ద చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశముంది’ అని అమరావతి వాతావరణ కేంద్రం(Amaravati meteorological department) సంచాలకులు స్టెల్లా, విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.