తెలంగాణ

telangana

తడిసిముద్దవుతోన్న హైదరాబాద్​.. వణికిపోతున్న నగరవాసులు..

By

Published : Jul 26, 2022, 5:25 PM IST

Heavy Rains in Hyderabad: జోరువానలకు భాగ్యనగరం తడిసిముద్దవుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మోకాల్లోతు ప్రవాహంతో... ప్రభావిత కాలనీలవాసులు ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. చెరువులకు వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.

Heavy Rains in Hyderabad Today
Heavy Rains in Hyderabad Today

Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌ వాసిని చినుకు వణికిస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాతబస్తీ, నారాయణగూడ దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, నాంపల్లి ఏరియాల్లో లోతట్టు కాలనీలు నీటమునిగి ప్రభావిత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసారంబాగ్ వంతెన పైనుంచి వరదనీరు ప్రవహించి.... గోల్నాక వైపు కాసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మలక్ పేట వంతెన కింద భారీగా వర్షపు నీటితో ట్రాఫిక్‌ నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దిల్‌సుఖ్​నగర్ ప్రాంతంలోని అనేక కాలనీలు వరదనీటిలోనే మగ్గుతున్నాయి. సరూర్‌నగర్ చెరువుకు దిగువన ఉన్న కోదండరాంనగర్, సీసల బస్తీ, పీ అండ్ టీ కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ కాలనీల్లో జనజీవనం స్తంభించింది. ఇళ్లలో నుంచి ప్రజలెవరూ బయటికి రాలేకపోతున్నారు. గతంలోనే సరూర్ నగర్ చెరువు ఈ కాలనీలను ముంచెత్తగా.... మళ్లీ వానలతో ఎప్పుడేం జరుగుతోందనని కాలనీల వాసులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు.

గాజులరామారంలోని ఓక్షిత్ ఎన్‌ క్లేవ్ ను మరో సారి వరదనీరు ముంచెత్తింది. ఎగువన ఉన్న పెద్దచెరువు నిండిపోయి.... దిగువకు నీరు చేరుతుండటంతో కాలనీ జలమయమైంది. మోకాళ్ల లోతు నీరు చేరుతుండటంతో కాలనీలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాంపల్లిలోని కాలనీల్లోకి వరద నీరు చేరింది. పటేల్ నగర్ లో సాయికృప అపార్ట్ మెంట్ చెరువును తలపిస్తోంది. పలువాహనాలు నీటిలో మునిగిపోయాయి. సురారం తెలుగుతల్లి నగర్ లో మోకాళ్ల లోతు నీరు చేరింది.

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని బీడీఎల్​ కాలనీ, వనస్థలిపురం గౌతమీనగర్ కాలనీలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు వర్షపునీటితో పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details